
ICC Rankings: పైకి ఎగబాకిన కోహ్లీ ర్యాంకు.. టాప్-10లోకి బుమ్రా
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ (767) రెండు ర్యాంకులను మెరుగుపరుచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. అదేవిధంగా బౌలర్ల విభాగంలో బుమ్రా టాప్-10లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో సెంచరీ సాధించిన రిషభ్ పంత్ 14వ స్థానంలోకి దూసుకొచ్చాడు. పంత్ పది స్థానాలను మెరుగుపరుచుకోవడం విశేషం. ఈ మేరకు ఐసీసీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాటింగ్ జాబితాలో.. మార్నస్ లబుషేన్ (935 పాయింట్లు), జో రూట్ (872), కేన్ విలియమ్సన్ (862), స్మిత్ (845), రోహిత్ శర్మ (773) వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. యాషెస్ సిరీస్‌లో రాణించిన ట్రావిస్ హెడ్ ఏకంగా ఏడు ర్యాంకులను మెరుగుపరుచుకుని ఆరోస్థానానికి ఎగబాకాడు.
టెస్టు ఫార్మాట్‌లో బౌలింగ్ విభాగానికి వస్తే.. రవిచంద్రన్ అశ్విన్ (839) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్యాట్ కమిన్స్ (898) తొలి స్థానంలో ఉన్నాడు. బుమ్రా (763) మూడు స్థానాలను మెరుగుపరుచుకుని పదో ర్యాంక్ సాధించాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ బుమ్రా (679) ఒక్కడే టాప్-10లో ఏడో స్థానంలో నిలిచాడు.