AB de Villiers: బెంగళూరు ఒక్కసారి కప్‌ కొడితే వరుసగా 3-4 టైటిళ్లు గెలుస్తుంది: ఏబీ డివిలియర్స్‌

భారత టీ20 లీగ్‌లో బెంగళూరు జట్టును చూస్తే పాపం అనిపించక మానదు. ఎందుకంటే జట్టులో ఎంతోమంది ప్రపంచస్థాయి బ్యాటర్లు, బౌలర్లు ఉన్నా 15 సీజన్లలో ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.

Published : 18 Nov 2022 21:20 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్‌లో బెంగళూరు జట్టును చూస్తే పాపం అనిపించక మానదు. ఎందుకంటే జట్టులో ఎంతోమంది ప్రపంచస్థాయి బ్యాటర్లు, బౌలర్లు ఉన్నా 15 సీజన్లలో ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరినా టైటిల్‌కు ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది. గత మూడేళ్లలో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ వరకు వచ్చినా కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌ల్లో తడబడి టైటిల్‌ కలను నెరవేర్చుకోకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో తొలి టైటిల్‌ని కైవసం చేసుకోవడానికి బెంగళూరు ఎంతో దూరంలో లేదని, ఒక్కసారి ఛాంపియన్‌గా నిలిచిందంటే తర్వాత వరసగా టైటిళ్లను గెలుచుకుంటుందని పేర్కొన్నాడు. 

‘భారత టీ20 లీగ్‌లో ఇప్పటివరకు ఎన్ని సీజన్లు పూర్తయ్యాయి? 14 లేదా 15 సీజన్లు అనుకుంటా. ఏదేమైనా బెంగళూరు ఆటగాళ్లు సవాళ్లు అధిగమించడానికి ఇష్టపడతారు. బెంగళూరు ఒక్కసారి కప్‌ కొడితే.. వరుసగా 3-4 సార్లు ఛాంపియన్‌గా నిలుస్తుందని నేను భావిస్తున్నా. టీ20 క్రికెట్‌  అంటేనే అంచనాలు తలకిందులు చేసే ఫార్మాట్‌. పొట్టి క్రికెట్‌లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించలేం. ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో. అయితే, ఈ సారి బెంగళూరు మారుతుందని ఆశిస్తున్నా’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో డిలివియర్స్ అన్నాడు. సుదీర్ఘ కాలంపాటు బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఏబీ డివిలియర్స్‌ గతేడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2023 సీజన్‌ కోసం బెంగళూరు జట్టుకు ఏబీ మెంటార్‌గా సేవలందించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని