KapilDev: మునుపటి ఫామ్‌ అందుకుంటే.. కోహ్లీ ట్రిపుల్‌ సెంచరీ చేయగలడు: కపిల్‌ దేవ్‌

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ స్పందించాడు. కెప్టెన్సీ కారణంగానే కోహ్లీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడని వస్తున్న వార్తలను అతడు కొట్టిపారేశాడు..

Published : 16 Sep 2021 02:26 IST

ఇంటర్నెట్‌ డెస్కు : టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ స్పందించాడు. కెప్టెన్సీ కారణంగానే కోహ్లీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడని వస్తున్న వార్తలను అతడు కొట్టిపారేశాడు. టీమ్‌ఇండియా పగ్గాలు చేపట్టిన కొత్తలో కోహ్లీ గొప్పగా రాణించి జట్టుకు విజయాలను అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. అతడు మునుపటి ఫామ్‌ను అందుకుంటే.. ట్రిపుల్‌ సెంచరీ చేయగలడని పేర్కొన్నాడు. 

‘కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోహ్లీ భారీ స్కోర్లు నమోదు చేసినప్పుడు ఎవరూ అతడి కెప్టెన్సీ గురించి మాట్లాడలేదు. గత కొద్దికాలంగా సెంచరీలు బాదలేకపోవడంతో.. కెప్టెన్సీ కారణంగానే కోహ్లీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడని అంటున్నారు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపల్లాలుంటాయి. ప్రస్తుతం కోహ్లీలో అద్భుతమైన పరిణతి కనిపిస్తోంది. అతడు మునుపటి ఫామ్‌ను అందుకుంటే.. ట్రిపుల్‌ సెంచరీ బాదగలడు. అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు అక్కర్లేదు. తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుని.. భారీ స్కోర్లపై దృష్టి సారించాలి’ అని కపిల్ దేవ్‌ సూచించాడు. 

దాదాపు రెండు సంవత్సరాలుగా కోహ్లీ శతకం నమోదు చేయకపోయినా సగటు మాత్రం మెరుగ్గానే ఉంది. వన్డేల్లో 46.66, టీ20ల్లో 52.60 సగటుతో అతడు కొనసాగుతుండటం విశేషం. కోహ్లీ చివరి సారిగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన ఓ మ్యాచులో సెంచరీ బాదాడు. ఈ మధ్యకాలంలో అర్ధ శతకాలు నమోదు చేస్తున్నా.. వాటిని శతకాలుగా మలచడంలో అతడు విఫలమవుతున్నాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో కోహ్లీ మునుపటి ఫామ్‌ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు