WTC Final: అలాగైతే సిరాజ్‌ వద్దు.. శార్దూల్‌ ముద్దు!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో నలుగురు పేసర్లను ఆడిస్తే మహ్మద్‌ సిరాజ్‌ బదులు శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకోవాలని మాజీ సెలక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ అన్నారు. సౌథాంప్టన్‌లో వాతావరణం చల్లగా ఉండి, మబ్బులుంటే అతడు ఉపయోగపడతాడని పేర్కొన్నారు.....

Published : 11 Jun 2021 15:42 IST

లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడన్న శరణ్‌దీప్‌

దిల్లీ: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో నలుగురు పేసర్లను ఆడిస్తే మహ్మద్‌ సిరాజ్‌ బదులు శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకోవాలని మాజీ సెలక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ అన్నారు. సౌథాంప్టన్‌లో వాతావరణం చల్లగా ఉండి, మబ్బులుంటే అతడు ఉపయోగపడతాడని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సిరీసులో సిరాజ్‌ అద్భుతంగా ఆడాడని ప్రశంసించారు. అయితే లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ పరంగా శార్దూల్‌ కీలకమవుతాడని వివరించారు.

‘సౌథాంప్టన్‌లో వాతావరణం చల్లగా ఉండి మబ్బులుంటే నాలుగో పేసర్‌ను ఆడించాలి. ఇషాంత్‌, జస్ప్రీత్‌, మహ్మద్‌ షమిని ఎలాగూ తీసుకుంటారు. అదనపు పేసర్‌గా నేనైతే సిరాజ్‌ బదులు శార్దూల్‌ను ఎంచుకుంటా. ఎందుకంటే లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ వనరులు అవసరం. శార్దూల్‌ అందుకు న్యాయం చేస్తాడు. పరిస్థితులకు తగ్గట్టు అతడు బంతిని బాగా స్వింగ్‌ చేయగలడు. పైగా దేశవాళీ క్రికెట్లో ఎక్కువ అనుభవం ఉంది. చురుకుగా ఆలోచిస్తాడు’ అని శరణ్‌దీప్‌ అన్నారు.

‘ఒకవేళ టీమ్‌ఇండియా నాలుగో పేసర్‌ను ఎంచుకుంటే దురదృష్టవశాత్తూ జడ్డూ బెంచీపై ఉండాలి. న్యూజిలాండ్‌లో ఎడమచేతివాటం ఆటగాళ్లు ఉండటంతో అశ్విన్‌ కచ్చితంగా ఆడాల్సిందే. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ విభాగం ఎలాగూ బాగుంది. శుభ్‌మన్‌ ఆస్ట్రేలియా ఫామ్‌ను ఇక్కడా కొనసాగించడం కీలకం. అతడో క్లాస్‌ ఆటగాడు. ఫైనల్‌లో రోహిత్‌తో కలిసి శుభారంభం అందిస్తాడనే అనుకుంటున్నా. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ సిరీసులో అతడు రాణించలేదు. ఇప్పుడు పుంజుకోవాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు.

ప్రస్తుతం టీమ్‌ఇండియాలో ఓపెనింగ్‌ స్థానానికి విపరీతమైన పోటీ నెలకొందని శరణ్‌దీప్‌ అన్నారు. ఇప్పటికే మయాంక్‌ అగర్వాల్‌ రిజర్వు బెంచీపై ఉన్నాడని గుర్తు చేశారు. తక్కువ వ్యవధిలోనే టెస్టుల్లో సత్తాచాటాడని పేర్కొన్నారు. పృథ్వీషా, దేవదత్‌ పడిక్కల్‌ వంటి ఆటగాళ్లు వరుసలో ఉన్నారని వెల్లడించారు.

శ్రీలంకకు ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్‌ పాండ్యకు బ్యాకప్‌గా దూబె లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు శరణ్‌దీప్‌. ఒకవేళ అతడు బౌలింగ్‌ చేయకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. శివమ్‌ దూబె లేదా విజయ్‌ శంకర్‌ ఉండాలన్నారు. ఆరుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారని అందరికీ జట్టులో చోటు దొరకదన్నారు. ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఉంటే మంచిదన్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని