
Team India : భారత జట్టులో మార్పులు అనివార్యం : రవిశాస్త్రి
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా గత కొద్ది కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు, వన్డే సిరీస్‌లో ఘోర పరాజయం పాలైంది. ఇదే సమయంలో భారత జట్టులో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం.. విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వన్డే పగ్గాలను అందుకోవడం స్వల్ప వ్యవధిలోనే జరిగిపోయాయి. మరోవైపు, గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడం కూడా జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే వన్డే, టీ20 ప్రపంచకప్‌లకు చాలా తక్కువ సమయం ఉందని.. ఆలోపు భారత జట్టులో మార్పుచేర్పులు చేసి టీమ్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత జట్టునే ప్రపంచకప్ వరకు కొనసాగించడం చాలా కష్టమని పేర్కొన్నాడు.
‘రాబోయే 8-10 నెలల కాలం భారత క్రికెట్‌కు చాలా ముఖ్యం. ఈ కొద్ది సమయంలోనే కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు జట్టు యాజమాన్యం.. మరో నాలుగైదేళ్లు టీమ్‌ఇండియాకు సేవలందించగల ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవమున్న ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లను కూడా జట్టులో భాగం చేయాలి. అప్పుడే జట్టుకు సమతూకం వస్తుంది. భారత క్రికెట్ దృష్ట్యా మార్పులు అనివార్యం. అందుకు ఇదే సరైన సమయం. ప్రస్తుత జట్టుతోనే ప్రపంచకప్ వరకు కొనసాగితే.. ఆ తర్వాత జట్టులో మార్పులు చేయడం చాలా కష్టమవుతుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.