WTC Final: పుజారాను నిందిస్తూ ముందుకెళ్తారా?

టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాకు దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అండగా నిలిచారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓటమికి అతడిని నిందిస్తే ఏం చేయలేమని తెలిపారు. న్యూజిలాండ్‌ క్రికెటర్లు సైతం నెమ్మదిగానే ఆడారని గుర్తు చేశారు. ...

Published : 28 Jun 2021 11:07 IST

కోహ్లీని పరోక్షంగా విమర్శించిన గావస్కర్‌

ముంబయి: టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాకు దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అండగా నిలిచారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓటమికి అతడిని నిందిస్తే ఏం చేయలేమని తెలిపారు. న్యూజిలాండ్‌ క్రికెటర్లు సైతం నెమ్మదిగానే ఆడారని గుర్తు చేశారు. సారథి విరాట్‌ కోహ్లీని ఉద్దేశించే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

‘పుజారాను వేలెత్తి చూపుతూ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడం కష్టం. అతడు డిఫెన్స్‌తో అడ్డుగోడగా నిలబడతాడు. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లకు ప్రాముఖ్యం తీసుకొస్తాడు. ఒక ఎండ్‌లో పాతుకుపోయి మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా ఆడేందుకు వీలు కల్పిస్తాడు’ అని గావస్కర్‌ అన్నారు.

‘చూడండి, మీరు టీమ్‌ఇండియా సంగతి పక్కన పెట్టండి. న్యూజిలాండ్‌ బ్యాటింగూ మెల్లగానే సాగింది. ఎందుకంటే పరిస్థితులు బ్యాట్స్‌మెన్‌ కన్నా ఎక్కువగా బౌలర్లకే అనుకూలంగా ఉన్నాయి. డేవిడ్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ సైతం ఆచితూచే ఇన్నింగ్స్‌లు ఆరంభించారు’ అని సన్నీ తెలిపారు.

బ్యాటింగ్‌ ద్వారా న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపింది కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌. నిజానికి అతడూ 70 బంతుల్లో 7 పరుగులే చేశాడు. అతడి డిఫెన్స్‌ ద్వారా మిగతా బ్యాట్స్‌మెన్‌ లాభపడ్డారని సన్నీ అభిప్రాయపడ్డారు. పుజారాను విమర్శించడం మానేసి దీనిని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.

‘మీరంతా దానిని గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్‌ సైతం మెల్లగానే ఇన్నింగ్స్‌ ఆరంభించింది. కానీ, మీరు పుజారాను వేలెత్తి చూపితే మాత్రం చేసేదేం లేదు. అవతలి ఎండ్‌లో ఆటగాడు స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు సాయపడే క్రికెటర్ పుజారా. డిఫెన్స్‌ అతడి శైలి అని అందరికీ తెలుసు’ అని సన్నీ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు