నేను ఫెయిల్‌ అవ్వాలని కొంతమంది కోరుకున్నారు.. కానీ నేను వదిలే రకం కాదు: రవిశాస్త్రి

బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చూసినా విఫలం కావాలని ..

Published : 26 Apr 2022 17:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చూసినా విఫలం కావాలని కొంతమంది కాచుకుని ఉంటారని టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. 2014-2021 వరకు మధ్యలో ఒక్క ఏడాది మినహా దాదాపు ఆరేళ్లపాటు రవిశాస్త్రి కోచింగ్‌ బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలంలోఎదురైన అనుభవాలను ఓ అంతర్జాతీయ పత్రికతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డైరెక్టర్‌గా పనిచేసిన రాబర్ట్‌ కీ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఈర్ష్యతో ఉన్నవారిని ఎదుర్కోవాలంటే మన చర్మం మందంగా ఉండాలి. అది డ్యూక్‌ బాల్‌ కంటే గట్టిగా ఉండాలని రాబర్ట్‌ కీ చెప్పేవాడు. ఆయన ఈసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఇలాంటివి అనుభవించాడు. నాకు కూడా భారత్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీమ్‌ఇండియా కోచ్‌గా పని చేసే కాలంలో నేను ఎప్పుడు విఫలమవుతానా..? అని కొంతమంది కోరుకునేవారు. అయితే నేను వదిలే రకం కాదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. 

రవిశాస్త్రిలానే రాబర్ట్‌ కీ  కూడా మంచి క్రికెట్ వ్యాఖ్యాత. చాలాఏళ్లపాటు కామెంటేటర్‌గా పనిచేశారు. ఎలాంటి అనుభవం లేకుండానే ఈసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దీనిని ఉటంకిస్తూ ‘‘నాకు కూడా కోచింగ్‌కు సంబంధించిన లెవల్‌ 1, లెవల్‌ 2 అనే బ్యాడ్జ్‌లు లేవు. డైరెక్ట్‌గా ప్రధాన కోచ్‌ పదవి వరించింది. దీంతో భారత్‌లోని కొంతమందికి ఇది నచ్చలేదు. ఈర్ష్యతో నేను విజయవంతం కాకూడదని బలంగా కోరుకున్నారు. అసూయంతో రగిలిపోయేవారు. అయితే నా చర్మం మందం.. ఎంత మందమంటే డ్యూక్‌ బంతిని తయారు చేసే లెథర్‌ కంటే కూడా గట్టిది. అందుకే అలాంటివి పట్టించుకోలేదు. అయితే అప్పటికే నాకు సారథిగా అనుభవం ఉంది. ఆటగాళ్లతో కమ్యూనికేషన్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు’’ అని వివరించాడు. 

రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడే ఆసీస్‌పై వరుసగా రెండు సిరీస్‌లను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. విదేశాల్లో సిరీస్‌లను గెలవగలమని నిరూపించింది. ‘‘విదేశాల్లో సిరీస్‌లను నెగ్గడం అద్భుతం. చాలా దూకుడుగా, దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడాం. అంతేకాకుండా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కూడా ఉన్నతస్థాయిలో ఉంది. విదేశీ పిచ్‌లపై 20 వికెట్లను తీయడం కోసం ఫాస్ట్‌ బౌలింగ్‌ దళం సిద్ధం చేసుకున్నాం. ఇక యాటిట్యూడ్‌ విషయంలోనూ తగ్గేదేలే అని నిరూపించాం. మరీ ముఖ్యంగా ఆసీస్‌తో ఆడేటప్పుడు ఆటగాళ్లకు ఒకటే చెప్పా.. ‘మీకు ఒకటి ఎదురైతే (స్లెడ్జింగ్‌ అయినా) వారికి మూడు తిరిగి ఇవ్వండి.. మన భాషలో రెండు, వారికి అర్ధమయ్యే భాషలో మరొకటి’అని దూకుడుగా ఉండాలని హితబోధ చేశా’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని