‘కుల్‌దీప్‌పై సవతి తల్లి ప్రేమ చూపించారనిపిస్తుంది’ 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు తనని ఎంపిక చేయకపోవడంపై టీమ్‌ఇండియా మణికట్టు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ మనసులో బాధపడ్డాడని, అయినా దాని గురించి మర్చిపోయి శ్రీలంక పర్యటనపై దృష్టి సారించాడని...

Published : 11 Jun 2021 17:15 IST

అతడి చిన్ననాటి కోచ్‌ కపిల్‌దేవ్‌ పాండే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు తనని ఎంపిక చేయకపోవడంపై టీమ్‌ఇండియా మణికట్టు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ బాధపడ్డాడని, అయినా దాని గురించి మర్చిపోయి శ్రీలంక పర్యటనపై దృష్టి సారించాడని చిన్ననాటి కోచ్‌ కపిల్‌ దేవ్‌ పాండే పేర్కొన్నారు. తాజాగా లంక పర్యటనకు సంబంధించి బీసీసీఐ శిఖర్‌ధావన్‌ కెప్టెన్సీలో యువ ఆటగాళ్ల బృందాన్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో కుల్‌దీప్‌ సైతం చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే పాండే ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన శిష్యుడిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘కుల్‌దీప్‌ బౌలింగ్‌లో గూగ్లీ బంతులే ప్రధాన అస్త్రాలు. ఆ బంతులు ఎప్పుడూ అతడికి వికెట్లు దక్కేలా చేసేవి. అయితే, ఇటీవలి కాలంలో సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏదో ఒక బంతి సరైన లెంగ్త్‌లో పడటం తప్ప మిగతావన్నీ ఎక్కడెక్కడో పిచ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజులుగా తన బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించాడు. బాగా సాధన చేసి సరైన లెంగ్త్‌తో ఇప్పుడు బంతులు వేయగలుగుతున్నాడు. అతడు వికెట్‌ టేకర్‌గా ఉంటూ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసేవాడు. అయితే, ఇప్పుడు తన అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని జోడించాలని నిర్ణయించుకున్నాడు. మధ్య ఓవర్లలో పరుగుల్ని నియంత్రించాలనుకుంటున్నాడు’ అని పాండే వివరించారు.

కుల్‌దీప్‌ ఇంకా మ్యాచ్‌ విన్నరే అని, ఇటీవల సరైన అవకాశాలు రాకపోవడంతో అతడి ఆత్మవిశ్వాసం లోపించిందని చిన్ననాటి కోచ్‌ అభిప్రాయపడ్డాడు. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో ఈ స్పిన్‌ స్పెషలిస్టు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా గత పర్యటనలో సగం మంది ఆటగాళ్లు గాయాలబారిన పడినా ఒక్క టెస్టులోనూ అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశాడు. అలాగే స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో అతడిని ఆడించి ఉంటే 30 వికెట్లు తీసేవాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఐపీఎల్‌లోనూ అతడిని రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేశారని, ఈ మాట అనాలని లేకున్నా.. జట్టు యాజమాన్యం అతడిపై ‘సవతి తల్లి ప్రేమ’ చూపిస్తుందనే అభిప్రాయం కొన్నిసార్లు కలుగుతుందని పాండే పేర్కొన్నారు. కుల్‌దీప్‌ గత రెండేళ్లుగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐదు మ్యాచ్‌ల్లో ఒకే వికెట్‌ తీసిన అతడు ఈసారి తొలిభాగంలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లంక పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడో వేచిచూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని