Ind vs Aus: రోహిత్‌ సెంచరీ మిస్‌.. ఆస్ట్రేలియా టార్గెట్‌ 206

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

Updated : 24 Jun 2024 22:03 IST

సెయింట్‌ లూసియా: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) సూపర్‌-8లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ (92; 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీర విహారం చేసి త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆరంభం నుంచే రోహిత్‌ శర్మ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిపడితే చాలు బౌండరీ అవతలికే అన్నట్లుగా విజృంభించాడు.  కేవలం 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ శతకం చేసేలా కనిపించాడు. కానీ, 92 పరుగుల వద్ద మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో బౌల్ట్ అయి పెవిలియన్‌కు చేరాడు. అయితే, తాజా ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

విరాట్‌ కోహ్లీ (0) నిరాశపరిచాడు. రెండో ఓవర్లోనే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి టిమ్‌ డేవిడ్‌ చేతికి చిక్కిపోయాడు. తొలి డౌన్‌లో వచ్చిన రిషభ్‌పంత్‌ (15)కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే సూర్యకుమార్‌ యాదవ్‌ (31; 16 బంతుల్లో 3×4,2×6) మెరుపులు మెరిపించాడు. దూకుడుగా ఆడుతున్న అతడి వేగానికి  మిచెల్‌ స్టార్క్‌ కళ్లెం వేశాడు. జట్టు స్కోరు 159 పరుగుల వద్ద వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్య వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివం దుబే (28; 22 బంతుల్లో 2×4, 1×6), హార్దిక్‌ పాండ్య (27*; 17 బంతుల్లో 1×4, 2×6), జడేజా (9*; 5 బంతుల్లో 1×6) జోరుగా పరుగులు రాబట్టడంతో భారత్‌ భారీ స్కోరే చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ (1/14) పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిచెల్ స్టార్క్ (2/45), స్టాయినిస్‌ (2/56) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కమిన్స్‌ 48, ఆడమ్ జంపా 41 పరుగులు ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని