IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సెప్టెంబరు 22న మొదటి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యే అవకాశముంది. 

Published : 22 Sep 2023 01:53 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మూడు వన్డేల సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం (సెప్టెంబరు 22) నుంచే సిరీస్ ప్రారంభంకానుంది. వన్డే ప్రపంచకప్‌ ముందు ఈ సిరీస్‌ ఇరు జట్లకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. మొదటి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేఎల్ రాహుల్ (KL Rahul) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. మూడో వన్డేకు వీరు అందుబాటులో ఉంటారు. దీంతో మొదటి రెండు వన్డేల్లో టీమ్‌ఇండియాకు ఆసీస్‌ గట్టిపోటీ ఇవ్వడం ఖాయం. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఈ ఇరుజట్ల మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి, ఆధిపత్యం ఎవరిది?, మొదటి వన్డేలో ఏ ఏ రికార్డులు నమోదయ్యే అవకాశముందో ఓ లుక్కేద్దాం. 

‘శుభ్‌మన్‌ గిల్ తదుపరి కోహ్లీ కావాలనుకుంటున్నాడు.. ప్రపంచకప్‌లో దంచికొడతాడు’

కంగారూలదే ఆధిపత్యం

వన్డేల్లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌దే ఆధిపత్యం. ఇప్పటివరకు 146 మ్యాచ్‌లు జరగ్గా.. ఆస్ట్రేలియా 82 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. టీమ్‌ఇండియా 54 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. వీటిలో 67 భారత్‌లో మ్యాచ్‌లు జరగ్గా కంగారూల జట్టు 32 సార్లు నెగ్గింది. 30 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా గెలుపొందింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

గెలిస్తే అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్

ఆసీస్‌తో మొదటి వన్డే టీమ్‌ఇండియా విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా జట్టుగా అవతరిస్తుంది. ప్రస్తుతం 115 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న భారత్.. పాక్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలుస్తుంది. టీమ్‌ఇండియా ఇప్పటికే టీ20లు, టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 

ఈ రికార్డులు నమోదవుతాయా? 

  • 1- డేవిడ్ వార్నర్ మరో సిక్స్ బాదితే వన్డేల్లో 100 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు.
  • 2- కామెరూన్ గ్రీన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైన వికెట్లు
  • 2- కేఎల్ రాహుల్ మరో రెండు సిక్స్‌లు బాదితే వన్డేల్లో 50 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు.
  • 3- రవిచంద్రన్ అశ్విన్ మరో మూడు వికెట్లు పడగొడితే అనిల్ కుంబ్లే (142)ను అధిగమించి ఆసీస్‌పై అన్ని ఫార్మాట్లలో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు.
  • 5- మార్కస్ స్టాయినిస్ మరో ఐదు సిక్స్‌లు బాదితే వన్డే క్రికెట్‌లో 50 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు.
  • 61- వన్డేల్లో స్టీవ్‌ స్మిత్ మరో 61 పరుగులు చేస్తే 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
  • 79- మార్నస్‌ లబుషేన్ మరో 79 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. 
  • 87- అన్ని ఫార్మాట్లలో మిచెల్ మార్ష్‌ 5 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి అవసరమైన పరుగులు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని