IND vs AUS: సూర్య కుమార్ యాదవ్‌కు రోహిత్ మద్దతు

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ సూర్యకుమార్‌ యాదవ్‌  (Suryakumar Yadav) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగడంతో అతడిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం సూర్యకు మద్దతుగా నిలిచాడు.

Updated : 23 Mar 2023 12:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20ల్లో రాణిస్తున్న టీమ్ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) వన్డేల్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో పేలవ ప్రదర్శన ఇచ్చాడు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో తొలి బంతికే గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతడిని వన్డేల నుంచి తప్పించి టీ20లకే పరిమితం చేయాలని కోరుతున్నారు. అయితే, టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌కు మద్దతుగా నిలిచాడు.

‘‘ఈ సిరీస్‌లో అతడు మూడు మ్యాచ్‌ల్లో మూడు బంతులు మాత్రమే ఆడాడు. దాన్ని ఎలా చూడాలో నాకు తెలీదు. మూడు వన్డేల్లోనూ అతడు అత్యంత కఠినమైన బంతులను ఎదుర్కొని ఔటయ్యాడు. అయితే, మూడో మ్యాచ్‌లో సూర్య ఔటైన తీరు నేను అస్సలు ఊహించలేదు. అతడు స్పిన్‌ బాగా ఆడగలడు. గత రెండు ఏళ్లుగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కొన్నాడో మనం కూడా చూశాం. అందుకే మేం అతడిని లోయర్‌ ఆర్డర్లో పంపాం. ఆఖరు 15-20 ఓవర్లలో అతడు తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటాడని భావించాం. కానీ, దురదృష్టవశాత్తూ సూర్యకుమార్‌ మూడు బంతులే ఆడాడు. ఇలా  ఎవరికైనా జరగొచ్చు. అంత మాత్రాన అతని సత్తా  తగ్గినట్లు కాదు. సూర్య తిరిగి అద్భుతంగా పుంజుకుంటాడని ఆశిస్తున్నా’ అని మూడో టెస్టు అనంతరం రోహిత్‌ శర్మ  అన్నాడు. ఆసీస్‌తో మొదటి రెండు వన్డేల్లో స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సూర్యకుమార్‌.. మూడో వన్డేలో అగర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని