Rahul Dravid - VVS Laxman: వీవీఎస్‌ లక్ష్మణ్‌ + రాహుల్‌ ద్రవిడ్‌ = 376

రాహుల్‌ ద్రవిడ్‌ - వీవీఎస్‌ లక్ష్మణ్‌ టీమ్‌ఇండియాకు రెండు కళ్లలాంటి వారు. ఒకప్పుడు ఆటగాళ్లుగా అదరగొట్టిన వీరు ఇప్పుడు భారత క్రికెట్‌ను ముందుకు నడిపిస్తున్న రథసారథులు...

Updated : 14 Mar 2022 11:49 IST

ఆస్ట్రేలియాపై చారిత్రక విజయానికి 21 ఏళ్లు..

రాహుల్‌ ద్రవిడ్‌ - వీవీఎస్‌ లక్ష్మణ్‌ టీమ్‌ఇండియాకు రెండు కళ్లలాంటి వారు. ఒకప్పుడు ఆటగాళ్లుగా అదరగొట్టిన వీరు.. ఇప్పుడు భారత క్రికెట్‌ను తమ అనుభవంతో ముందుకు నడిపిస్తున్నారు. ఒకరు హెడ్‌కోచ్‌గా పనిచేస్తుంటే.. మరొకరు జాతీయ క్రికెట్‌ అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాగా, ఈ దిగ్గజాలు సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆస్ట్రేలియాపై రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 2001లో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను ఫాలోఆన్‌ నుంచి గట్టెక్కించడమే కాకుండా.. విజయతీరాలకు తీసుకెళ్లారు. ఆ విశిష్టమైన సందర్భాన్ని పురస్కరించుకొని నాటి విశేషాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.

ఆ మ్యాచ్‌కు ముందు ఏం జరిగింది..

టీమ్‌ఇండియా సాధించిన అతిగొప్ప విజయాల్లో నాటి కోల్‌కతా టెస్టు అన్నింటికన్నా ప్రధానమైంది. ఎందుకంటే ఆస్ట్రేలియా అప్పటికే వరుసగా 16 టెస్టులు గెలిచి దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. దీంతో ఈడెన్‌లోనూ టీమ్‌ఇండియాకు మరో ఓటమి తప్పదనే భావన అందరిలోనూ నెలకొంది. సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు అంతకుముందే వరుసగా ఆరు టెస్టులు కోల్పోయింది. పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా ఫాలోఆన్‌లో పడటంతో మరో ఘోర పరాభవం తప్పదనుకున్నారు. అలాంటి స్థితిలో లక్ష్మణ్‌, ద్రవిడ్‌ రికార్డు భాగస్వామ్యానికి తోడు చివరిరోజు హర్భజన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ మాయాజాలంతో జట్టును గెలిపించారు.

ఆస్ట్రేలియా దంచికొట్టి.. భారత్‌ను కట్టడి చేసి..

మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా అప్పటికే ముంబయిలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించింది. ఇక కోల్‌కతాలో జరిగిన రెండో టెస్టులోనూ అదృష్టం కలిసివచ్చి టాస్‌ గెలిచిన ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌వా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో మాథ్యూ హేడెన్‌ (97), జస్టిన్‌ లాంగర్‌ (58), స్టీవ్‌వా (110) రాణించడంతో ఆస్ట్రేలియా 445 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం టీమ్‌ఇండియా 171 పరుగులకే కుప్పకూలింది. లక్ష్మణ్‌ (59) టాప్‌ స్కోరర్‌. దీంతో 274 పరుగుల లోటుతో ఫాలోఆన్‌ ఆడిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 657/7 స్కోర్‌ సాధించి చివరిరోజు ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. ఇక 383 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆసీస్‌ 212 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ 171 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

లక్ష్మణ్‌ + ద్రవిడ్‌ = 376

అయితే, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలవడానికి ప్రధాన కారణం లక్ష్మణ్‌ (281; 452 బంతుల్లో 44x4), ద్రవిడ్‌ (180; 353 బంతుల్లో 20x4) బ్యాటింగే. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మూడో రోజు 232 పరుగుల వద్ద గంగూలీ (48) వికెట్‌ కోల్పోయాక వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయారు. ఆరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 254/4 స్కోర్‌ సాధించగా.. ఇక నాలుగో రోజు ఆటలో వీరు మరింత రెచ్చిపోయారు. ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. ఒక్క వికెట్‌ కూడా పడనీయకుండా జాగ్రత్తగా ఆడారు. చివరికి ద్రవిడ్‌ 155, లక్ష్మణ్‌ 275 పరుగులతో నాలుగో రోజు ఆట ముగించారు. ఈ క్రమంలోనే ఐదో రోజు.. లక్ష్మణ్‌ 281, ద్రవిడ్‌ 180 పరుగులు సాధించాక ఔటయ్యారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత భారత్‌ 657/7 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆపై భారత బౌలర్లు చెలరేగి ఆసీస్‌ను 212కే కట్టడి చేశారు. చివరి సెషన్‌లో హర్భజన్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీయడం విశేషం.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని