IND vs AUS 2nd ODI : ఆసీస్‌ పేస్‌కు టీమ్‌ఇండియా విలవిల.. 117 పరుగులకే కుప్పకూలిన రోహిత్‌ సేన

విశాఖ వన్డే(vizag ODI)లో ఆసీస్‌ పేస్‌ అటాక్‌ ముందు టీమ్‌ఇండియా(TeamIndia) చతికిలబడింది. 117 పరుగులకే కుప్పకూలింది.

Updated : 19 Mar 2023 16:38 IST

విశాఖ : ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో ఘన విజయాన్ని నమోదు చేసిన టీమ్‌ఇండియా రెండో వన్డేలో చతికిలపడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన.. దాదాపు సగం ఓవర్లు (26 ఓవర్లు) మాత్రమే ఆడి 117 పరుగులకు ఆలౌటయ్యింది. స్టార్క్‌, అబాట్‌, ఎల్లీస్‌ పేస్‌ అటాక్‌ ముందు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెలవెలబోయింది. కోహ్లీ(31), అక్షర్‌ పటేల్‌(29) ఆ కాస్త రాణించడంతో.. భారత్‌ స్కోరు వంద పరుగులైనా దాటగలిగింది. గిల్‌, సూర్య, షమీ, సిరాజ్‌ డకౌట్లు కాగా.. కేఎల్‌ రాహుల్‌, పాండ్య, కుల్‌దీప్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 5 వికెట్లతో విజృంభించగా.. అబాట్‌ 3, ఎల్లీస్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

తొలి నుంచే.. 

వర్షం పడుతూ.. ఆగుతూ అసలు మ్యాచ్‌ జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాల మధ్యనే రెండో వన్డే ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆసీస్ బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే, తొలి ఓవర్‌ మూడో బంతికే శుభ్‌మన్‌ గిల్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ (13) ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే స్టార్క్‌ విజృంభించి రోహిత్‌తోపాటు సూర్యకుమార్‌ను వరుస బంతుల్లో ఔట్‌ చేసి దెబ్బకొట్టాడు. తొలి వన్డే హీరోలు కేఎల్ రాహుల్ (9), రవీంద్ర జడేజా కూడా ఎక్కువ సేపు నిలవలేదు. హార్దిక్‌ (1) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. చివర్లో స్టార్క్‌ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ రెండు సిక్స్‌లు కొట్టడంతో భారత్‌ స్కోరు వంద దాటిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని