IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆటముగిసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో భారత్‌ 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Updated : 04 Jul 2022 00:35 IST

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆటముగిసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో భారత్‌ 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో పుజారా (50 నాటౌట్‌: 139 బంతుల్లో), పంత్‌ (30 నాటౌట్‌: 46 బంతుల్లో) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన భారత్‌ నాలుగు పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్‌(4) వికెట్‌ను కోల్పోయింది. దీంతో విహారితో కలిసి మరో ఓపెనర్‌ పుజారా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్‌ 43 పరుగుల వద్ద విహారి(11) బ్రాడ్‌కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి కోహ్లీ వచ్చాడు. ఇద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడినప్పటికీ 75 పరుగుల వద్ద కోహ్లీ(20) స్టోక్స్‌ బౌలింగ్‌లో రూట్‌కు దొరికిపోయాడు. మరోవైపు క్రీజులో నిలుదొక్కుకున్న పుజారా తర్వాత వచ్చిన పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో పుజారా అర్ధశతకం నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి ఇలాగే ఆడితే నాలుగోరోజు భారత్‌కు భారీ స్కోర్‌ చేసే అవకాశం లభిస్తుంది.


నిరాశ పరిచిన కోహ్లీ..

విరాట్‌ కోహ్లీ (20; 40 బంతుల్లో 4x4) మరోసారి నిరాశపర్చాడు. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో బెన్‌స్టోక్స్‌ వేసిన 29.5 ఓవర్‌కు కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా అది చేజారింది. అయితే, పక్కనే ఉన్న జోరూట్‌ ఆ బంతిని అందుకోవడంతో విరాట్‌ వెనుదిరగక తప్పలేదు. దీంతో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 30 ఓవర్లకు జట్టు స్కోర్‌ 76/3గా నమోదైంది. క్రీజులో పుజారా (33), రిషభ్‌ పంత్‌ (1) ఉన్నారు. మొత్తం ఆధిక్యం 208 పరుగులకు చేరింది.


 ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆధిక్యం 200 దాటింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌.. ప్రస్తుతం 25 ఓవర్లకు 68/2తో కొనసాగుతోంది. క్రీజులో పుజారా(32), కోహ్లీ (15) ఉన్నారు. వీరిద్దరూ 25 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. అంతకుముందు అండర్సన్‌ వేసిన తొలి ఓవర్‌లోనే శుభ్‌మన్‌గిల్ (4) గిల్ ఔటయ్యాడు. ఆపై విహారి, పుజారా నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను పూర్తి చేశారు. అయితే, టీ విరామం అనంతరం మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే స్టువర్ట్‌బ్రాడ్‌ వేసిన 17వ ఓవర్‌లో విహారి (11) ఔటయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా 43 పరుగుల వద్ద రెండో వికెట్‌ నష్టపోయింది. అనంతరం పుజారా, కోహ్లీ నిలకడగా ఆడుతున్నారు.

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(4) వికెట్‌ కోల్పోయినా.. పుజారా (17), హనుమ విహారి (10) ఆచితూచి ఆడుతున్నారు. అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మూడో బంతికే గిల్‌ స్లిప్‌లో దొరికిపోయి ఔటయ్యాడు. దీంతో టీమ్ఇండియా 4 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌ చేస్తున్న విహారి, పుజారా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని మూడో రోజు రెండో సెషన్‌ను పూర్తి చేశారు. దీంతో 13 ఓవర్లకు జట్టు స్కోర్‌ 37/1గా నమోదైంది. మొత్తం ఆధిక్యం 169 పరుగులకు చేరింది. 


ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ పూర్తయింది. ఆ జట్టు 284 పరుగులకు ఆలౌటైంది. జానీ బెయిర్‌ స్టో (106; 140 బంతుల్లో 14x4, 2x6) శతకంతో మెరిసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడికి కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (25), సామ్‌ బిల్లింగ్స్‌ (36) చక్కటి సహకారం అందించారు. ఈ క్రమంలోనే వారిద్దరితో బెయిర్‌స్టో ఆరు, ఏడు వికెట్లకు 66, 92 పరుగుల విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో మాటీ పాట్స్‌ (19) వేగంగా పరుగులు రాబట్టాడు.

కాగా, 84/5తో ఆదివారం మూడోరోజు ఆట కొనసాగించిన బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ తొలుత నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అయితే, శార్దూల్‌ వేసిన 38వ ఓవర్‌లో స్టోక్స్‌ బౌండరీ కొట్టబోయి.. బుమ్రా చేతికి చిక్కాడు. తర్వాత బెయిర్‌స్టో.. బిల్లింగ్స్‌తో కలిసి ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే శతకం పూర్తి చేసుకున్నాక షమి బౌలింగ్‌లో స్లిప్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. దీంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత బిల్లింగ్స్‌, మాటీ పాట్స్‌ పలు బౌండరీలు బాది జట్టు స్కోర్‌ను 284 పరుగులకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 4, బుమ్రా 3, షమి 2, శార్దూల్‌ 1 వికెట్‌ తీశారు. ఇక టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 132 పరుగులుగా నమోదైంది.


ఇంగ్లాండ్‌ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత షమి వేసిన 55వ ఓవర్‌లో శతక వీరుడు జానీ బెయిర్‌ స్టో (106; 140 బంతుల్లో 14x4, 2x6) ఔటయ్యాడు. అతడు స్లిప్‌లో విరాట్‌ కోహ్లీ చేతికి చిక్కడంతో ఇంగ్లాండ్‌ 241 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం సిరాజ్‌ వేసిన 56వ ఓవర్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ (1) గాల్లోకి షాట్‌ ఆడగా కీపర్‌ పంత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ 248 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం సామ్‌ బిల్లింగ్స్‌ (28), పాట్స్‌ (0) క్రీజులో ఉన్నారు. 56 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 250/8 స్కోర్‌తో నిలిచింది.


బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌ స్టో (100; 119 బంతుల్లో 14x4, 2x6) శతకం బాదాడు. తొలుత వికెట్‌ కాపాడుకునేందుకు నెమ్మదిగా ఆడిన అతడు తర్వాత రెచ్చిపోతున్నాడు. 83/5తో కష్టాల్లో పడిన జట్టుని ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (25)తో కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అతడు తర్వాత సామ్‌ బిల్లింగ్స్‌(20)తో కలిసి మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పుతున్నాడు. ఈ క్రమంలోనే శార్దూల్‌ వేసిన 48వ ఓవర్‌ చివరి బంతికి బౌండరీ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌ స్కోర్‌ 227/6గా నమోదైంది. ప్రస్తుతం వీరిద్దరూ 65 బంతుల్లో 77 పరుగులు చేసి వేగంగా ఆడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని