IND vs ENG: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 ఆలౌట్‌.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 378

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు మొత్తం 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది...

Updated : 04 Jul 2022 20:39 IST

బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు మొత్తం 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెన్‌స్టోక్స్‌ వేసిన 82వ ఓవర్‌లో బుమ్రా(7) నాలుగో బంతికి భారీ సిక్సర్‌ కొట్టాడు. అయితే, ఐదో బంతిని కూడా స్టాండ్స్‌లోకి తరలించాలని చూసి గాల్లోకి షాట్‌ ఆడాడు. కానీ, క్రాలే పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. అంతకుముందు 80వ ఓవర్‌లో జడేజా (27) స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. సిరాజ్‌ (2) నాటౌట్‌గా నిలిచాడు. కాగా, టీమ్‌ఇండియా నాలుగో రోజు 125/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆటను ప్రారంభించింది. పుజారా (66), పంత్‌ (57) అర్ధశతకాలతో రాణించారు. అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ (19), జడేజా (27) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 4 వికెట్లు తీయగా, పాట్స్‌, బ్రాడ్‌ చెరో 2 వికెట్లు తీశారు. అండర్సన్, లీచ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.


బర్మింగ్‌హామ్‌: రెండో సెషన్‌ ప్రారంభమైంది. అయితే, భోజన విరామం తర్వాత స్టోక్స్‌ వేసిన తొలి ఓవర్‌లోనే షమి (13) ఔటయ్యాడు. అతడు ఆడిన షాట్‌ను లీస్‌ క్యాచ్‌ అందుకోవడంతో టీమ్‌ఇండియా 230 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో జడేజా (19), బుమ్రా(0) ఉన్నారు. దీంతో 75 ఓవర్లకు జట్టు స్కోర్‌ 231/8గా నమోదైంది. ప్రస్తుతం ఆధిక్యం 363 పరుగులకు చేరింది.


బర్మింగ్‌హామ్‌: నాలుగో రోజు ఆటలో తొలి సెషన్‌ పూర్తయింది. మొత్తం 28 ఓవర్ల ఆట జరగ్గా టీమ్‌ఇండియా ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 125/3కి మరో 104 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. పుజారా (66), పంత్‌ (57) అర్ధ శతకాలతో రాణించారు. అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ (19) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం జడేజా (17), షమి (13) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో భోజన విరామ సమయానికి టీమ్‌ఇండియా 73 ఓవర్లకు 229/7తో నిలిచింది. ఇప్పుడు మొత్తం ఆధిక్యం 361 పరుగులకు చేరింది.


 

బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ (4) ఔటయ్యాడు. పాట్స్‌ వేసిన 69.1 ఓవర్‌కు ఫ్లిక్‌ షాట్‌ ఆడి బౌండరీ లైన్‌ వద్ద ఓలీ పోప్‌ చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 207 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. మరోవైపు క్రీజులో జడేజా(11), షమి(4) ఉన్నారు. దీంతో 70 ఓవర్లకు జట్టు స్కోర్‌ 212/7గా నమోదైంది. మొత్తం ఆధిక్యం 344 పరుగులకు చేరింది.


బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. శ్రేయస్‌ (19) ఔటైన కాసేపటికే పంత్‌ (57) కూడా పెవిలియన్‌ చేరాడు. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో అతడు రివర్స్‌స్వీప్‌ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల వెనకాల జోరూట్‌ చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 198 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం జడేజా(5), శార్దూల్‌ ఠాకూర్‌ (0) క్రీజులో ఉన్నారు. 64 ఓవర్ల తర్వాత మొత్తం ఆధిక్యం 331 పరుగులకు చేరింది.


బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్‌ కోల్పోయింది. పాట్స్‌ వేసిన 59.2 ఓవర్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ (19) ఔటయ్యాడు. అతడు పుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి మిడ్‌వికెట్‌లో అండర్సన్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 190 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. మరోవైపు రిషభ్ పంత్‌ (53) హాఫ్‌ సెంచరీతో కొనసాగుతున్నాడు. బ్రాడ్‌ వేసిన 58.3 ఓవర్‌కు అతడు బౌండరీ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పుడే క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు. దీంతో 60 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్‌ 194/5గా నమోదైంది. దీంతో మొత్తం ఆధిక్యం 326 పరుగులకు చేరింది.


బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్టువర్ట్‌బ్రాడ్‌ వేసిన 52.3 ఓవర్‌కు పుజారా (66) ఔటయ్యాడు. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడిన షాట్‌ను అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న లీస్‌ క్యాచ్‌ అందుకోవడంతో టీమ్‌ఇండియా 153 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పంత్‌ (43), శ్రేయస్‌ అయ్యర్‌ (2) ఉన్నారు. ఈ క్రమంలోనే 54 ఓవర్లకు జట్టు స్కోర్‌ 159/4గా నమోదైంది. మొత్తం ఆధిక్య 291 పరుగులకు చేరింది.


బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది. పంత్‌(37), పుజారా (61) రెండో ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 50 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమ్‌ఇండియా స్కోర్‌ 146/3గా నమోదైంది. దీంతో టీమ్‌ఇండియా ఆధిక్యం మొత్తం 278కి చేరింది. మరోవైపు బర్మింగ్‌హామ్‌లో ఈరోజు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటంతో మొత్తం 98 ఓవర్ల పాటు ఆట జరిగే వీలుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కనీసం రెండు సెషన్లు ఆడి మంచి స్కోర్‌ సాధించి చివరి సెషన్‌లో ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని