IND vs ENG: రికార్డులు బద్దలు కొడుతున్న హార్దిక్‌ పాండ్య

టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సూపర్‌ఫామ్‌ కొనసాగుతోంది. భారత టీ20 లీగ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే

Updated : 18 Jul 2022 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సూపర్‌ఫామ్‌ కొనసాగుతోంది. భారత టీ20 లీగ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపి రికార్డు సృష్టించాడు. ఆ తరవాత టీమ్‌ఇండియాకు ఎంపికై దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అనంతరం ఐర్లాండ్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించి మరో ఘనత సాధించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో 4 వికెట్లు తీయడంతో పాటు 71 పరుగులు చేసి టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే టెస్టుల్లో, టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు, అర్ధశతకం బాదిన హార్దిక్‌.. తాజా ప్రదర్శనతో మూడు ఫార్మాట్లలో 4 అంతకంటే ఎక్కువ వికెట్లు, 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు.

ప్రపంచ క్రికెట్‌లో ఇంతవరకు పాకిస్థాన్‌ ఆటగాడు మహమ్మద్‌ హఫీజ్‌ మాత్రమే ఈ అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లాండ్ పైనే మూడు ఫార్మాట్‌లో ఈ ఫీట్‌ అందుకొన్న తొలి ప్లేయర్‌గా హార్దిక్‌ మరో రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌పై నాటింగ్‌హామ్‌ వేదికగా 2018లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 52 పరుగులతో  పాటు 5 వికెట్లు పడగొట్టాడు. తాజాగా సౌతాంఫ్టన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో4 వికెట్లతో పాటు 51 పరుగులు సాధించాడు. మొత్తంగా వన్డే క్రికెట్‌లో భారత్‌ తరఫున ఇంతవరకు నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఇలా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అలరించారు. అయితే, ఆసియా ఆవల ఈ రికార్డు సాధించిన తొలి భారత ఆటగాడు మాత్రం హార్దిక్‌ పాండ్యనే. ఇంతకముందు కృష్ణమాచారి శ్రీకాంత్‌, సచిన్‌ ఒక్కోసారి ఈ ఘనత సాధించగా, గంగూలీ, యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు సాధించారు. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్‌ ఐర్లాండ్‌పై ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన తరవాత మళ్లీ ఇన్నాళ్లకు హార్దిక్‌ రూపంలో అభిమానులు మరో చూడముచ్చటైన ప్రదర్శన చూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని