IND vs ENG: అక్కడే ప్రత్యర్థికి అవకాశం ఇచ్చాం: జస్ప్రిత్‌ బుమ్రా

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటవ్వడమే తమ కొంప ముంచిందని తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రా అన్నాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు...

Published : 06 Jul 2022 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటవ్వడమే తమ కొంప ముంచిందని తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రా అన్నాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియా మూడు రోజుల పాటు బాగా ఆడిందని.. కానీ, నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు ఆలౌటవ్వడంతో ఇంగ్లాండ్‌కు అవకాశం ఇచ్చామని పేర్కొన్నాడు. దీంతో తాము అక్కడే మ్యాచ్‌లో వెనుకబడిపోయామని చెప్పాడు. అయితే, గతేడాది జరిగిన తొలి టెస్టులో వర్షం పడకుంటే టీమ్‌ఇండియానే సిరీస్‌ గెలిచేదని బుమ్రా అభిప్రాయపడ్డాడు. కాగా, ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించే క్రమంలో వర్షం అంతరాయం కారణంగా డ్రాగా ముగిసింది.

ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అతడు స్టువర్ట్‌బ్రాడ్‌ బౌలింగ్‌లో 35 పరుగులు సాధించడంపై స్పందిస్తూ.. దానికి తానేం ఆల్‌రౌండర్‌లా ఫీలవ్వట్లేదని స్పష్టం చేశాడు. అలాగే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బాగా ఆడారని.. దీంతో వారు సిరీస్‌ను సమం చేసుకున్నారని మెచ్చుకున్నాడు. ఇది సరైన ఫలితమేనని, ఈ ఓటమి పట్ల విచారపడట్లేదని తెలిపాడు. అనంతరం టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజాలపై స్పందించిన అతడు.. వారిద్దరూ తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్నారని ప్రశంసించాడు. అవకాశం వచ్చినప్పుడల్లా పంత్ చెలరేగిపోతున్నాడన్నాడు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడని వివరించాడు. అలాగే జట్టు బాధ్యతలు తీసుకోవడం తనకు ఇష్టమే అయినా భవిష్యత్‌ కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌ తనకు మంచి అనుభవం ఇచ్చిందని బుమ్రా పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని