IND vs ENG: ఇప్పుడా భయంలేదు.. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడమే: బెయిర్‌స్టో

టీమ్‌ఇండియాతో ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు (106; 114) బాదాక తనలో వైఫల్యాల భయం పోయిందని ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌ స్టో అన్నాడు...

Published : 06 Jul 2022 01:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు (106; 114) బాదాక తనలో వైఫల్యాల భయం పోయిందని ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌ స్టో అన్నాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడిన అతడు ఈ సంవత్సరం ఏకంగా ఆరు శతకాలు బాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు.

‘ఇప్పుడు మా జట్టులో చాలా సంతోషం నెలకొంది. గతనెల కూడా మాకు అద్భుతంగా గడిచింది. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. నేను బ్యాటింగ్‌లో ప్రాథమిక అంశాలకే కట్టుబడి ఉన్నా. అయితే, కొన్నేళ్లుగా సరైన ప్రదర్శన లేక ఇబ్బంది పడ్డా. కానీ గతకొన్ని నెలలుగా అద్భుతంగా ఆడుతున్నా. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అలాగే నేను కూడా ఇప్పుడెంతో ఆనందంగా ఉన్నా. ఇప్పుడిక వైఫల్యాల గురించి భయపడట్లేదు. నా ఆటతో ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నా. కానీ, మేం ఇలా దూకుడుగా ఆడితే మ్యాచ్‌లు కోల్పోయే ప్రమాదం ఉంది. అయినా దీన్ని సానుకూలంగా తీసుకొని సరదాగా ఆడుతున్నాం’ అని బెయిర్‌స్టో అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని