IND vs ENG: మాయ చేసిన చాహల్‌.. ఇంగ్లాండ్‌ 246 ఆలౌట్‌

టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌటైంది. యుజ్వేంద్ర చాహల్‌ 4/47 అద్భుతమైన స్పెల్‌కు ఆ జట్టు కీలక ఆటగాళ్లు తేలిపోయారు...

Updated : 14 Jul 2022 21:31 IST

మరోసారి ఆకట్టుకున్న భారత బౌలర్లు..

లార్డ్స్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌటైంది. యుజ్వేంద్ర చాహల్‌ 4/47 అద్భుతమైన స్పెల్‌కు ఆ జట్టు కీలక ఆటగాళ్లు తేలిపోయారు. మొయిన్‌ అలీ (47; 64 బంతుల్లో 2x4, 2x6), డేవిడ్‌ విల్లే (41; 49 బంతుల్లో 2x4, 2x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు కీలకమైన 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ 49 ఓవర్లకు కుప్పకూలింది.

ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (23; 33 బంతుల్లో 2x4, 1x6), జానీ బెయిర్‌ స్టో (38; 38 బంతుల్లో 6x4) మెరుగ్గా ఆరంభించినా ఇంగ్లాండ్‌ ఆకట్టుకోలేకపోయింది. హార్దిక్‌ పాండ్య తన తొలి ఓవర్‌లోనే జేసన్‌ రాయ్‌ను ఔట్‌చేసి టీమ్‌ఇండియాకు  తొలి బ్రేక్‌ ఇచ్చాడు. తర్వాత చాహల్‌ వరుసగా.. బెయిర్‌ స్టో, జో రూట్‌ (11), బెన్‌ స్టోక్స్‌ (21)లను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌కు గట్టి షాకిచ్చాడు. ఈ క్రమంలోనే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (4)ను షమి బోల్తా కొట్టించాడు. దీంతో ఇంగ్లాండ్‌ 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (33; 33 బంతుల్లో 2x4, 2x6), మొయిన్‌ అలీ పోరాడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించాక హార్దిక్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ ఔటయ్యాడు. తర్వాత మొయిన్‌ అలీ, విల్లే నిలకడగా ఆడి ఏడో వికెట్‌కు మరో విలువైన భాగస్వామ్యం జోడించారు. చివరికి అలీ సైతం చాహల్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. తర్వాత విల్లే టెయిలెండర్లతో కలిసి కాస్త ధాటిగా ఆడి ఇంగ్లాండ్‌కు మంచి స్కోర్‌ అందించాడు. టీమ్‌ఇండియా మిగతా బౌలర్లలో బుమ్రా, హార్దిక్‌ చెరో రెండు వికెట్లు తీయగా ప్రసిద్ధ్‌, షమి తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు