IND vs ENG: టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ విజయం.. సిరీస్‌ సమం

టీమ్‌ఇండియాతో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది...

Updated : 05 Jul 2022 20:10 IST

బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియాతో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌ (142 నాటౌట్‌; 173 బంతుల్లో 19x4, 1x6), జానీ బెయిర్‌ స్టో (114 నాటౌట్‌; 145 బంతుల్లో 15x4, 1x6) శతకాలతో అదరగొట్టారు. 109కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నారు.

మంగళవారం 259/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆట కొనసాగించిన వీరిద్దరూ.. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆది నుంచే బౌండరీలు సాధిస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మరో వికెట్‌ పడకుండా ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో టెస్టుల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక ఛేదనగా రికార్డు విజయం అందించారు. మరోవైపు ఇంగ్లాండ్‌ ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 132 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 245 పరుగులకే ఆలౌటై నిరాశ పర్చింది. మరోవైపు ఇంగ్లాండ్‌ ఇటీవల న్యూజిలాండ్‌ మీద సైతం ఇలాగే దూకుడుగా ఆడి ఓడిపోయే మ్యాచ్‌ను గెలిచింది. స్టోక్స్‌ చెప్పినట్లు అదే అస్త్రాన్ని టీమ్‌ఇండియాపై ప్రయోగించి విజయం సాధించింది.

అయితే, టీమ్‌ఇండియా ఓటమికి ప్రధాన కారణం బౌలింగేనని స్పష్టంగా అర్థమవుతోంది. రూట్‌, బెయిర్‌స్టోలను ఔట్‌ చేయలేక మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయింది. వీరిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 269 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. దీన్నిబట్టే భారత బౌలింగ్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా, గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి చారిత్రక విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, రూట్‌, బెయిర్‌స్టో టీమ్‌ఇండియా ఆశలపై నీళ్లు చల్లారు.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ : బెయిర్‌ స్టో.

ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: జో రూట్‌.

టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌: 416 ఆలౌట్‌, పంత్‌ 146, జడేజా 104.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284 ఆలౌట్‌, బెయిర్‌ స్టో 106, బిల్లింగ్స్‌ 36.

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌: 245 ఆలౌట్‌, పుజారా 66, పంత్‌ 57.

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 378/3, రూట్‌ 142, బెయిర్‌ స్టో 114.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని