IND vs ENG: సెమీస్ పోరు.. చాహల్‌ను తీసుకొస్తారా..?

టీ20 ప్రపంచకప్‌ మెగా సమరంలో టీమ్‌ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో నేడు జరిగే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన కూర్పు ఎలా ఉండనుంది..? మార్పులు ఉంటాయా?

Updated : 10 Nov 2022 10:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ టైటిల్ కలను సాధించేందుకు టీమ్‌ఇండియా ఇంకా రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. గురువారం జరిగే కీలకమైన సెమీస్‌ పోరులో రోహిత్‌ సేన ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత జట్టులో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. అక్షర్‌ పటేల్‌ స్థానంలో స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ను తీసుకొచ్చే అవకాశాలున్నాయి.

పిచ్‌ పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపారు. సెమీస్‌ జరిగే అడిలైడ్‌ ఓవల్‌  పిచ్‌ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అక్షర్‌ స్థానంలో చాహల్‌ను ఆడించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక దినేశ్‌ కార్తిక్, రిషభ్ పంత్‌.. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ టోర్నీలో దినేశ్ కార్తిక్‌ అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో.. గత మ్యాచ్‌లో పంత్‌కు అవకాశం కల్పించారు. అయితే, జింబాబ్వే మ్యాచ్‌లో పంత్‌ కూడా ఆశించినంత మేర రాణించలేదు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే పంత్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. అడిలైడ్‌లో నేడు వర్షం పడే అవకాశం లేదు. బ్యాటింగ్‌కు సహకరించే ఈ పిచ్‌పై లక్ష్య ఛేదనలోనే 40శాతం విజయావకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

తుది జట్ల అంచనా..

ఇండియా: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, చాహల్‌, రవిచంద్రన్ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, షమీ, అర్షదీప్‌

ఇంగ్లాండ్‌: జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), అలెక్స్‌ హేల్స్‌, ఫిలిప్‌ సాల్ట్, బెన్‌ స్టోక్స్‌, హారీ బ్రూక్‌, మొయిన్‌ అలీ, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, శామ్‌ కరణ్‌, క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు