IND vs ENG: హార్దిక్‌ అత్యుత్తమ బౌలింగ్‌.. ఇంగ్లాండ్‌ 259 ఆలౌట్

టీమ్‌ఇండియాతో జరుగుతోన్న మూడో వన్డేలో మరోసారి టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది...

Updated : 17 Jul 2022 19:45 IST

మాంచెస్టర్‌: టీమ్‌ఇండియాతో జరుగుతోన్న మూడో వన్డేలో మరోసారి టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్‌ పాండ్య (4/24), యుజ్వేంద్ర చాహల్‌ (3/60) ఇంగ్లిష్‌ జట్టు భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకున్నారు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (60; 80 బంతుల్లో 3x4, 2x6) అర్ధశతకంతో రాణించగా.. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (41; 31 బంతుల్లో 7x4) రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో క్రేగ్‌ ఓవర్టన్‌ (32; 33 బంతుల్లో 1x4, 1x6), డేవిడ్‌ విల్లే (18; 15 బంతుల్లో 1x4, 1x6) ఎనిమిదో వికెట్‌కు కీలకమైన 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. భారత బౌలర్లలో హార్దిక్‌ 4, చాహల్‌ 3, సిరాజ్‌ 2, జడేజా 1 వికెట్‌ తీశారు. 

సిరాజ్‌ మొదలు.. పాండ్య వికెట్లు

జస్ప్రిత్‌ బుమ్రా స్థానంలో ఈ రోజు జట్టులోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ తనదైన ముద్ర వేశాడు. బుమ్రాలా తొలి ఓవర్లలోనే కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్‌లో జానీ బెయిర్‌స్టో, జో రూట్‌ను డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత రాయ్‌, బెన్‌ స్టోక్స్‌ (27) కాసేపు జాగ్రత్తగా ఆడారు. రాయ్‌ వేగం పెంచే క్రమంలో హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో ఔటైపోయాడు. ఆ తర్వాత బెన్‌ స్టోక్స్ కూడా వెనుదిరిగాడు. ఈ సమయంలో కెప్టెన్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఇద్దరూ కలసి 75 పరుగులు జోడించారు. 

మొయిన్‌ అలీ (34)ని జడేజా తన తొలి ఓవర్‌లోనే బోల్తా కొట్టించాడు. దీంతో ఇన్నింగ్స్‌ను సరిదిద్దే పనిని బట్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌ చేతుల్లోకి వచ్చింది. ఇద్దరూ దూకుడుగానే ఆడుతుండగా.. కొత్త స్పెల్‌ ప్రారంభించిన హార్దిక్‌ పాండ్య మరోసారి ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. బట్లర్‌, లివింగ్‌స్టన్‌ (27)ల క్యాచ్‌లు పట్టి జడేజా పెవిలియన్‌కు దారి చూపించాడు. అప్పటికి ఇంగ్లాండ్‌ స్కోరు 199. దీంతో ఇక ఇంగ్లాండ్‌ను మన కుర్రాళ్లు చుట్టేస్తారేమో అనుకుంటే.. ఓవర్టన్‌ , డేవిడ్ విల్లే అడ్డుపడ్డారు. యుజ్వేంద్ర చాహల్‌ ఆఖరి మూడు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ అవ్వడానికి ఎంతో సేపు పట్టలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు