IND vs IRE: సంజూకి అవకాశమా.. త్రిపాఠికి అరంగేట్రమా..?

ఛాన్స్‌ దక్కితే చాలు.. పొట్టి ఫార్మాట్‌లో యువ బ్యాట్స్‌మెన్‌లు అదరగొడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన దీపక్‌ హుడా

Updated : 28 Jun 2022 14:17 IST

ఐర్లాండ్‌తో నేడు రెండో టీ20..

క్లీన్‌ స్వీప్‌ లక్ష్యంగా యువ భారత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఛాన్స్‌ దక్కితే చాలు.. పొట్టి ఫార్మాట్‌లో యువ బ్యాట్స్‌మెన్‌లు అదరగొడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన దీపక్‌ హుడా...డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో చెలరేగి ఆడాడు.  రుతురాజ్‌కు గాయం కావడంతో ఓపెనర్‌గా దిగిన హుడా...వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

రెండో టీ20లో ఎవరికి ఛాన్స్‌?

భారత టీ20 లీగ్‌లో రాణించి ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపికైనా సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి ఇప్పుడు తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. తొలి టీ20లో రుతురాజ్‌కు పిక్క కండరాలు పట్టేయడంతో ఓపెనింగ్‌ చేయలేదు. దీంతో జట్టు యాజమాన్యం మిడిలార్డర్‌లో ఆడే హుడాను ఓపెనర్‌గా  పంపించింది. అయితే రెండో టీ20కి రుతురాజ్‌ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠిలో ఒకరు ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు  డబ్లిన్‌ వేదికగా రెండో టీ20జరగనుంది.

సంజూకి సపోర్ట్‌

శాంసన్‌కు ఇదివరకే టీమ్‌ఇండియాకు ఆడిన అనుభవం ఉంది. టాలెంట్ ఉన్నా.. నిలకడలేమి ,సరైన సమయంలో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో భారత జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోలేదు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌లో 17 మ్యాచ్‌ల్లో 146.79 స్ట్రెక్‌రేట్‌తో 458 పరుగులు సాధించాడు. దీంతో అతడు దక్షిణాఫ్రికా  సిరీస్‌కు ఎంపికవుతాడని అంతా భావించారు. అయితే మిడిలార్డర్‌లో పంత్‌, శ్రేయస్‌ ఉండటంతో సంజూకి అవకాశం రాలేదు. తాజాగా ఐర్లాండ్‌ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. దీంతో రెండో టీ20లో అతడిని ఎలా అయినా ఆడించాలని అభిమానులు సోషల్‌ మీడియాలో మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు సంజూ లాంటి మ్యాచ్‌విన్నర్లు జట్టులో  ఉండాలని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. 

త్రిపాఠి అరంగేట్రం చేస్తాడా? 

టీమ్‌ఇండియాకు తొలిసారి ఎంపికైనా రాహుల్‌ త్రిపాఠి అరంగేట్ర మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. కొన్నేళ్లుగా భారత టీ20 లీగ్‌లో రాణిస్తున్నాడు. ఈ ఏడాది హైదారాబాద్‌ తరఫున  మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి  అద్భుతమైన స్ట్రెక్‌రేట్‌ (158.24)తో 413 పరుగులు( 14 మ్యాచ్‌ల్లో) సాధించాడు. దీంతో సెలెకర్లు అతడిని ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపిక చేశారు. గత మ్యాచ్‌లో  భారత టీ20 లీగ్‌లో హైదారాబాద్‌ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్‌ మాలిక్‌ అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో కోచ్‌గా ఉన్న వీవీయస్‌ లక్ష్మణ్‌ త్రిపాఠికి కూడా అవకాశం కల్పిస్తాడని పలువురు అభిమానులు  అంటున్నారు. భారత టీ20 లీగ్‌లో హైదారాబాద్‌ జట్టుకు లక్ష్మణ్‌ మెంటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 

వీరిద్దరూ ఆడతారా? 

సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠిలో ఒకరు రెండో టీ20లో ఆడే ఛాన్స్‌ ఎక్కువ. అయితే ఇద్దరినీ తుది జట్టులో ఆడించాలంటే  పెద్దగా రాణించని అక్షర్‌ పటేల్‌ని బెంచ్‌కి పరిమితం చేయాలి. ఐదో బౌలర్‌గా హార్దిక్‌, హుడా ఉండటంతో ఈ మార్పు చేయడానికి అవకాశం ఉంది. లేదంటే అక్షర్‌ స్థానంలో అర్ష్‌దీప్‌ని కూడా ఆడించొచ్చు. జట్టు కూర్పు పై  కోచ్‌ లక్ష్మణ్‌, కెప్టెన్‌ హార్దిక్‌దే తుది నిర్ణయం కాబట్టి ఎలాంటి మార్పులైనా జరగొచ్చు. ఏం చేస్తారో చుడాలి మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని