
IND vs NZ: కివీస్ స్పిన్నర్ మాయాజాలం.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు
టీమ్ఇండియా 325 ఆలౌట్..
ముంబయి: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వాంఖడే మైదానంలో టీమ్ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ చేశాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. 1999లో పాకిస్థాన్‌పై అనిల్ కుంబ్లే సాధించిన ఈ ఘనత మళ్లీ ఇన్నాళ్లకు నమోదైంది. అంతకుముందు ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాపై తొలిసారి ఈ రికార్డు సృష్టించాడు. దీంతో కివీస్ తరఫున అజాజ్ (10/119) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ (150; 311 బంతుల్లో 17x4, 4x6), అక్షర్ పటేల్ (52; 128 బంతుల్లో 5x4, 1x6) రాణించారు.
ఆదిలోనే భయపెట్టిన అజాజ్..
221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 104 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన రెండో ఓవర్లోనే అజాజ్.. సాహా(27; 62 బంతుల్లో 3x4, 1x6), రవిచంద్రన్ అశ్విన్(0)లను వరుస బంతుల్లో ఔట్ చేసి మరోసారి గట్టిదెబ్బ తీశాడు. అయితే, తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ (52; 128 బంతుల్లో 5x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. మయాంక్‌తో కలిసి ఏడో వికెట్‌కు 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో సెషన్లో మయాంక్ 150 పరుగులు పూర్తి చేసిన మరుసటి బంతికే అజాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అతడు కీపర్ టామ్ బ్లండెల్ చేతికి చిక్కడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోర్ 291/7గా నమోదైంది. తర్వాత టెయిలెండర్లు పెద్దగా రాణించకపోవడంతో భారత్ 325 పరుగులకు ఆలౌటైంది.