IND vs NZ: అదొక్కటే కాస్త నిరాశపర్చింది: రాహుల్‌ ద్రవిడ్‌

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా పరుగుల పరంగా అత్యంత భారీ విజయం సాధించడంపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హర్షం వ్యక్తం చేశాడు...

Published : 07 Dec 2021 02:16 IST

టెస్టు సిరీస్‌ విజయంపై టీమ్‌ఇండియా కోచ్‌

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా పరుగుల పరంగా అత్యంత భారీ విజయం సాధించడంపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హర్షం వ్యక్తం చేశాడు. అయితే, కాన్పూర్‌ టెస్టులో విజయం అంచుల దాకా వెళ్లి పని పూర్తి చేయకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందని చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘సిరీస్‌ను విజయంతో ముగించడం బాగుంది. కానీ, కాన్పూర్‌లోనే ఆఖరి వికెట్‌ తీయలేకపోయాం. అదే కాస్త నిరాశకు గురిచేసింది. అయినా భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఆటగాళ్లకే ఆ క్రెడిటంతా దక్కుతుంది. కఠిన పరిస్థితుల నుంచి బాగా పుంజుకున్నారు. యువకులు బాగా ఆడారు. సీనియర్లు లేకున్నా తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. జయంత్‌ యాదవ్ ఆదివారం రాణించకపోయినా ఈరోజు ఉదయం నాలుగు వికెట్లతో మెరిశాడు. ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌, మయాంక్‌ అగర్వాల్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌లాంటి ఆటగాళ్లు ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాదు. అయినా వారు ఇలా ఆడటం బాగుంది’ అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు.

‘అలాగే మేం రెండో ఇన్నింగ్స్‌లో తొలుత డిక్లేర్‌ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఆటలో ఇంకా చాలా సమయం మిగిలి ఉండటంతో న్యూజిలాండ్‌ను ఎలాగైనా ఆలౌట్‌ చేస్తామనే నమ్మకం ఉంది. ఇలాంటి ఎర్రమట్టి వికెట్‌పై బంతి బౌన్స్‌ అవుతున్న వేళ బ్యాటింగ్‌ చేయడం యువకులను మరింత మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతుంది’ అని రాహుల్‌ వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆడేటప్పుడు పలువురు ఆటగాళ్లు గాయపడ్డారని, అది కాస్త ఆందోళనకు గురిచేస్తోందని తెలిపాడు. ఫార్మాట్లకు అతీతంగా ఆటగాళ్లు చాలా మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో వాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. అదే సమయంలో యువకులు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారని, దీంతో రాబోయే మ్యాచ్‌ల గురించి ఆలోచిస్తే..  ఎవరిని ఎలా ఆడించాలనేది తలనొప్పిగా ఉంటుందని ద్రవిడ్‌ సరదాగా అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని