
IND vs NZ: అజాజ్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చిన అశ్విన్
ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్ స్పిన్ సంచలనం అజాజ్ పటేల్‌కు టీమ్ఇండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సాయం చేశాడు. ఎవరైనా ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఖాతాలు లేదా పేజీలు నిర్వహిస్తే అందుకు సంబంధించిన వెరిఫైడ్ అకౌంట్‌ను తెలిపేలా ఆయా సంస్థలు ‘బ్లూటిక్ మార్క్’ను కేటాయిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, భారత్‌తో రెండో టెస్టుకు ముందు అజాజ్ పటేల్ ట్విటర్ ఖాతాకు లేని ‘బ్లూ టిక్’ మార్క్.. తాజాగా వచ్చింది. దీని వెనకాల భారత స్పిన్నర్ అశ్విన్ ఉండటమే గమనించాల్సిన విషయం.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా పది వికెట్లను పడగొట్టిన అజాజ్.. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మారుమోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. అయితే, మ్యాచ్ అనంతరం కూడా అజాజ్ ట్విటర్ ఖాతాకు వెరిఫైడ్ అకౌంట్ బ్లూ టిక్‌మార్క్ లేకపోవడంతో అశ్విన్ చొరవ తీసుకొని వెరిఫైడ్ అకౌంట్ కేటాయించే పేజీ నిర్వాహకులకు ట్వీట్ చేశాడు. ‘డియర్ ట్విటర్ వెరిఫైడ్ టీమ్.. ఒక్క ఇన్నింగ్స్‌లోనే పది వికెట్లు తీసిన వ్యక్తి ట్విటర్ ఖాతాకు.. వెరిఫైడ్ అకౌంట్ అనే గుర్తింపు కచ్చితంగా ఉండాలి. అందుకు అతడు అర్హుడే’ అంటూ సరదాగా నవ్వుతున్న ఎమోజీతో సహా పోస్టు చేశాడు. దీంతో కాసేపటికే అజాజ్ ట్విటర్ ఖాతాకు వెరిఫైడ్ బ్లూ టిక్ కేటాయించారు. అనంతరం అశ్విన్ మళ్లీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అలా చివరికి అజాజ్.. అశ్విన్ వల్ల కొత్త గుర్తింపు దక్కించుకున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.