IND vs NZ: ఈ ముగ్గురు మొనగాళ్లను కివీస్‌ అడ్డుకుంటుందా?

ప్రపంచ కప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ఫుల్‌ జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా (Team India).. పటిష్ఠమైన కివీస్‌తో ఆదివారం తలపడనుంది. ఇరు జట్ల బలబలాలు, కొంతకాలంగా ఏ జట్టు ఆధిపత్యం చలాయించిందో తెలుసుకుందాం..

Updated : 21 Oct 2023 13:56 IST

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ఇండియా (Team India) కీలక సమరానికి సిద్ధమవుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ (New Zealand)తో ఆదివారం (అక్టోబర్‌ 22న) తలపడనుంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సవాలే. మరోవైపు, కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్‌ ఆధిపత్యం చలాయించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో కివీస్‌.. భారత్‌కు షాకిచ్చిన విషయాన్ని అంత సులువుగా మర్చిపోం. ఈ నేపథ్యలో జట్ల బలబాలాలు, కొన్నేళ్లుగా భారత్‌పై కివీస్ ఎలా ఆధిపత్యం చలాయించిందో ఓ లుక్కేద్దాం.

‘టాప్‌’ను తట్టుకుంటుందా?

వరుస విజయాలో దూసుకుపోతున్న టీమ్‌ఇండియా కూడా బలంగానే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మన ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌, కోహ్లీ, కేఎల్ రాహుల్ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. అఫ్గాన్‌పై సెంచరీ చేసిన రోహిత్.. పాక్‌పై భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. బంగ్లాదేశ్‌పై (48) త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు.  కోహ్లీ పాక్‌తో మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో రాణించాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ కూడా బాదాడు. కేఎల్ రాహుల్ కూడా కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ ముగ్గురు మొనగాళ్లు రాణిస్తే కివీస్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. గిల్, శ్రేయస్ కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా.. వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారు. వీరు కూడా టాప్‌గేర్‌లోకి వస్తే భారత్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. లోయర్‌ ఆర్డర్‌లో జడేజా ఎలాగూ ఉండనే ఉన్నాడు. గాయం కారణంగా హార్దిక్ కివీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవడం భారత్‌కు ప్రతికూలాంశం. ఇక, బౌలింగ్‌లో బుమ్రా, జడేజా, కుల్‌దీప్‌ యాదవ్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తున్నారు. సిరాజ్ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. టీమ్ఇండియా సమష్టిగా రాణిస్తే కివీస్‌ను చిత్తు చేయడం పెద్దకష్టమేమీ కాదని క్రికెట్ విశ్లేషకుల మాట.

విజయాల జోరుకు అడ్డు కట్ట వేసేనా? 

మరోవైపు వరుసగా రెండుసార్లు (2015, 2019) ఫైనల్‌కు చేరినా కప్‌ కలను సాకారం చేసుకోలేకపోయింది న్యూజిలాండ్. ఈ ప్రపంచకప్‌లోనైనా ఆ లోటును తీర్చుకోవాలని కివీస్‌ కసిగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీదుంది. డేవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, లాథమ్, ఫిలిప్స్‌లతో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్ పటిష్ఠంగా ఉంది. వీరంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. చివర్లో చాప్‌మన్‌, మిచెల్ శాంట్నర్‌ మెరుపులు మెరిపిస్తున్నారు. రచిన్ రవీంద్ర, కాన్వే ఇప్పటికే సెంచరీలు బాదారు. విల్ యంగ్, ఫిలిప్స్‌, డారిల్ మిచెల్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలింగ్‌లో మ్యాట్‌ హెన్రీ, ఫెర్గూసన్‌, శాంట్నర్‌ అదరగొడుతున్నారు. ప్రస్తుతం శాంట్నర్ 11 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్ ఎక్కువగా వికెట్లు పడగొట్టకపోయినా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.

అదే ఆఖరి విజయం

2003 ప్రపంచకప్‌లో సౌరభ్‌ గంగూలీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా.. కివీస్‌ను ఓడించింది. తొలుత న్యూజిలాండ్‌ను 146కే ఆలౌట్‌ చేసిన భారత్.. ఈ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 56 బంతులు మిగిలుండగా ఛేదించింది. ఐసీసీ టోర్నీల్లో కివీస్‌పై భారత్‌కిదే ఆఖరి విజయం. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో మన జట్టుకు ఓటమి తప్పలేదు.

అక్కడ ఏకైక ఓటమి..

2007లో నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌తో మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలుపొందడం గమనార్హం. తొలుత మెక్‌కల్లమ్‌ (45), క్రెయిగ్ మెక్మిలాన్‌ (44), జాకబ్ ఓరమ్ (35) రాణించడంతో కివీస్‌ 190 పరుగులకు ఆలౌటైంది. ఈ భారీ లక్ష్యఛేదనలో భారత్ విఫలమైంది. ఓపెనర్లు గంభీర్ (51), సెహ్వాగ్ (40) శుభారంభం అందించినా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్పిన్నర్ డానియల్ వెటొరీ (4/20) టీమ్‌ఇండియాను దెబ్బకొట్టాడు.

బంతితో కళ్లెం వేసినా.. 

2016 టీ20 ప్రపంచకప్‌లోనూ కివీస్‌ చేతిలో భారత్‌కు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లో అదరగొట్టి ప్రత్యర్థి జట్టుని 126/7కే కట్టడి చేసినా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ 79 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. కోహ్లీ (23), ధోనీ (30), అశ్విన్ (10) మినహా మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. రోహిత్‌ (5), శిఖర్‌ ధావన్ (1), సురేశ్ రైనా (1), యువరాజ్‌ సింగ్ (4), హార్దిక్ పాండ్య (1), జడేజా (0) ఘోరంగా విఫలమయ్యారు.

ఒక్క రనౌట్‌తో.. కోట్లాది గుండెలు బద్దలు.. 

2019 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. తర్వాత ఇరుజట్లు సెమీస్‌లో తలపడగా.. భారత్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. ఈ కీలకమైన పోరులో కేఎల్ రాహుల్ (1), రోహిత్ (1), కోహ్లీ (1) వరుసగా పెవిలియన్ బాటపట్టడంతో 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రవీంద్ర జడేజా (77), ధోనీ (50) పోరాడినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. జట్టు స్కోరు 208 వద్ద జడేజా ఔటైనా ధోనీ క్రీజులో ఉండటంతో టీమ్‌ఇండియా అభిమానులు గెలుపుపై ధీమాతోనే ఉన్నారు. అయితే, 216 పరుగుల వద్ద ధోనీ కూడా రనౌట్‌గా వెనుదిరగడంతో భారత్‌ విజయావకాశాలు ఆవిరయ్యాయి. ధోనీ రనౌట్‌ కావడంతో దేశంలో ఉన్న కోట్లాది క్రికెట్ అభిమానుల గుండెలు బద్దలైనంత పనైంది.

‘గద’ను గద్దలా తన్నుకుపోయి

మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ (డబ్ల్యూటీసీ)ను 2019-21 మధ్య నిర్వహించారు. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు ‘గద’ను ట్రోఫీగా బహుకరిస్తారు. తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్ విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217, రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్‌ కాగా.. కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 249, రెండో ఇన్నింగ్స్‌లో 140/2 స్కోరు చేసింది. 2021 టీ20 ప్రపంచకప్‌లోనూ కివీస్‌ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియాను 110 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. 14.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

ఇలా ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై ఆధిపత్యం చలాయించిన కివీస్‌ను.. ఈ సారైనా ఓడించి ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

- ఇంటర్నెట్ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని