
IND vs PAK: నాలుగేళ్లు.. రెండు ఘోర పరాభవాలు.. తప్పులెక్కడ?
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ మాత్రమే కాదు.. కోట్లాది మంది అభిమానులకు పండుగే.. రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే రసవత్తర పోరు. అలాంటిది గత నాలుగేళ్లలో దాయాదితో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా రెండు ఓటములు చవిచూసింది. ఇది ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యాన్ని నెమ్మదిగా తగ్గించేట్లు కనపడుతోంది. మొత్తంగా ఇరు దేశాల మధ్య ఆటలో పాకిస్థాన్‌దే పైచేయి అయినా.. మూడు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రం టీమ్‌ఇండియాదే ఆధిపత్యం. అలాంటిది ఇప్పుడు ఇలా రెండు ఘోర పరాభవాలు అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. అసలు కోహ్లీసేన దారుణ వైఫల్యాలకు కారణాలేంటి..? ఇకపై గెలవాలంటే ఏం చేయాలి..? ఈ ప్రశ్నలే ఇప్పుడు అందర్నీ వెంటాడుతున్నాయి..!
అక్కడ కోహ్లీదే తప్పు..
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే టీమ్‌ఇండియాకు పాకిస్థాన్ గట్టి షాకిచ్చింది. తొలుత లీగ్ స్టేజ్‌లో దాయాది జట్టు కోహ్లీసేన చేతిలో 124 పరుగుల తేడాతో ఓడిపోయినా ఫైనల్లో దిమ్మతిరిగే విజయం సాధించింది. ఫకర్ జమాన్ (114) శతకానికి తోడు మిగతా బ్యాట్స్‌మన్ రాణించడంతో పాక్ 338/4 భారీ లక్ష్యాన్ని విసిరింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (0), ధావన్ (21), కెప్టెన్ కోహ్లీ (5)ని మహ్మద్ అమిర్ దెబ్బతీశాడు. 33 పరుగులకే మూడు వికెట్లు తీసి భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. అనంతరం టీమ్‌ఇండియా 158 పరుగులకే కుప్పకూలి 180 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. ఆరోజు టాస్ గెలిచినా కోహ్లీ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఫీల్డింగ్ ఎంచుకోవడమే అతిపెద్ద తప్పు. ఈ మ్యాచ్ జరిగింది లండన్‌లోని ఓవల్ మైదానంలో. తొలుత పిచ్ పేసర్లకు కఠినంగా ఉన్నా రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా మారిపోయింది. దీంతో పాక్ పేసర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ఈ విజయం ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీల్లో పాక్ ఆధిపత్యం 3-2కి చేరింది.
ఇక్కడ సర్ఫరాజ్ తప్పు..
ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ - పాక్ మరోసారి తలపడ్డాయి. ఈసారి పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్‌ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ (57), రోహిత్ శర్మ (140), విరాట్ కోహ్లీ (77) దంచికొట్టడంతో భారత్ 336/5 భారీ స్కోర్ చేసింది. అనంతరం పాక్ లక్ష్య ఛేదనలో వర్షం అంతరాయం కలిగించగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ఆ మ్యాచ్‌లో పాక్ 212/6 స్కోర్‌కే పరిమితం అయింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది కూడా ఇంగ్లాండ్‌లోనే మాంచెస్టర్ మైదానంలో జరిగింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ చేసిన తప్పే ఈసారి పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించింది. చివరికి ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ పాక్‌పై 12-0 ఆధిక్యం సాధించింది.
ఈసారి ఫలించిన వ్యూహం..
ఇక ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ వేదిక గురించి అతడికి పూర్తి అవగాహన ఉండటంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన ఆరు ఓవర్లకే టీమ్‌ఇండియా మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో బాబర్ నిర్ణయం సరైందని తేలింది. షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్(0), రాహుల్(3) ఔటవ్వగా.. సూర్యకుమార్(11)ను హసన్ అలీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్ 31 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి జారుకొంది. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (57), రిషభ్ పంత్(39) వికెట్లు పడకుండా అడ్డుకొన్నా.. ధాటిగా షాట్లు ఆడలేకపోయారు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో చివరికి టీమ్‌ఇండియా 151/7 స్కోర్ సాధించింది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఓపెనర్లు రిజ్వాన్ (79), బాబర్ (68) ఒక్క వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌పై (12-1) తొలి విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు.
ఇవీ అసలు కారణాలు..
* టాస్‌లే కీలకం: ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా ఓటములకు టాస్ కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచి ఉంటే కచ్చితంగా బౌలింగే ఎంచుకునేవాడు. ఎందుకంటే లక్ష్య ఛేదనలో మంచు ప్రభావం అధికంగా ఉండటంతో ఏ జట్టు అయినా దుబాయ్‌లో ఆ నిర్ణయమే తీసుకుంటుంది. అయితే, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అతడి నిర్ణయం కచ్చితంగా తప్పేనని నిపుణుల భావన. అది బ్యాటింగ్ పిచ్ అయినా తొలుత బౌలింగ్ తీసుకోవడం పై విమర్శలొచ్చాయి.
* భారీ అంచనాలతో ఒత్తిడి: కొంతకాలంగా టీమ్‌ఇండియా ఎంత బాగా రాణిస్తున్నా ఏదో ఒక సందర్భంలో ఘోరంగా చతికిల పడుతోంది. ప్రతి మెగా టోర్నీలో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగడం, భారీ అంచనాల నడుమ కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడం పరిపాటిగా మారింది. ఇది గత ఆరేళ్లుగా ఇలాగే జరుగుతోంది. అందుకు నిదర్శనమే.. 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లు. మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే టీమ్‌ఇండియాపై భారీ అంచనాలు ఉంటున్నాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నారు.
* బలహీనతలు: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్‌నూ తాము తేలిగ్గా తీసుకోమని చెబుతున్నా వాస్తవంగా పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. భారత టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్ బలహీనతలపై ప్రత్యర్థులు దృష్టిసారించి కీలక మ్యాచ్‌ల్లో సరైన ఫలితాలు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ సైతం అదే వ్యూహాన్ని రచించి 2017లో అమీర్‌తో, ఇప్పుడు షహీన్‌తో తమకు కావాలసిన వికెట్లను దక్కించుకుంది.
* తేలిక భావం: పేపర్ మీద టీమ్‌ఇండియా అంత బలమైన జట్టు ప్రస్తుతం ఎక్కడా లేదు. అయినా కోహ్లీసేన ఇలా ఊహించని విధంగా చతికిలపడుతోంది. జట్టు నిండా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే విన్నర్లున్నా.. ఒత్తిడికి చిత్తవుతున్నారు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి బరిలోకి దిగడంతో ఈ పరిస్థితి నెలకొంటోందనే విమర్శలున్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే తరచూ పునరావృతం అవుతోంది.
* పాక్ పకడ్బందీగా: మరోవైపు పాకిస్థాన్ ఇంతకుముందులా లేదనేది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా గతనెలలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు పాకిస్థాన్ పర్యటనలను రద్దు చేసుకోవడం కూడా ప్రధాన కారణం. గొప్ప జట్లుగా పేరున్న వాటికి తమ ఆటతోనే బదులివ్వాలనే నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తాము తక్కువేమీ కాదని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. దీంతో పకడ్బందీ ప్రణాళికతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టి భారత్‌కు షాకిచ్చింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో రాణించి కోహ్లీసేనకు పీడకల మిగిల్చింది.
నోట్: పైన పేర్కొన్న కారణాలన్నీ టీమ్‌ఇండియా ఓటములకు పలు కారణాలుగా కనిపిస్తున్నా పాకిస్థాన్‌ను సరైన రీతిలో ఎదుర్కోలేకపోవడమే కోహ్లీసేన చేసిన అతి పెద్ద తప్పు. ఆ జట్టు ఇటీవల ఎలా ఆడుతోంది.? అందులో కీలక ఆటగాళ్లు ఎవరు? బౌలర్లు ఎలా రాణిస్తున్నారు.? వారిని ఎలా ఎదుర్కోవాలి.? 2017లో నాటి పరిస్థితులే ఇప్పుడూ ఎదురైతే ఏం చేయాలి? మన బౌలర్లు ఎలా రాణించాలి? అనే విషయాలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక నుంచి పాకిస్థాన్‌పై విజయం సాధించాలంటే అన్ని విభాగాల్లో రాణించాలి. ఆటలో గెలుపోటములు సహజమే అయినా మరీ ఇంత దారుణంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరగా భారత్ ఇకపై అన్ని మ్యాచ్‌లు గెలుపొంది ఫైనల్లో పాకిస్థాన్‌తో మరోసారి తలపడాలని, అప్పుడు టీమ్‌ఇండియా గెలవాలని సగటు అభిమాని ఆశిస్తున్నాడు. అదే జరగాలని మనమూ కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమ్‌ఇండియా..!
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.