IND vs PAK: ఇప్పుడొస్తుంది అసలు మజా

ప్రపంచకప్‌ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆసియా కప్‌ ఒకటి. ఆసియా ఖండంలో ఆరు జట్లు తలపడుతున్న టోర్నీ ఇది. కానీ మూడు రోజుల ముందే కప్పు మొదలైనా చప్పుడే లేదు. రెండు మ్యాచ్‌లు పూర్తయినా ఏ చర్చా లేదు.

Updated : 02 Sep 2023 09:35 IST

ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ పోరు నేడే
ఫేవరెట్‌ రోహిత్‌ సేనే

మధ్యాహ్నం 3 నుంచి

ప్రపంచకప్‌ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆసియా కప్‌ ఒకటి. ఆసియా ఖండంలో ఆరు జట్లు తలపడుతున్న టోర్నీ ఇది. కానీ మూడు రోజుల ముందే కప్పు మొదలైనా చప్పుడే లేదు. రెండు మ్యాచ్‌లు పూర్తయినా ఏ చర్చా లేదు.

కానీ ఇంకొన్ని గంటల్లో అంతా మారిపోతుంది. ఆసియా వాసులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులంతా టీవీలకు కళ్లప్పగించే సమయం వచ్చేసింది. ఎందుకంటే ఈ రోజు జరగబోయేది భారత్‌-పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌. క్రికెట్‌ మ్యాచ్‌లా కాకుండా యుద్ధంలా సాగే ఈ మెగా పోరుకు ఆసియా కప్‌ వేదిక కాబోతోంది.

ఎన్నో ఏళ్ల పాటు పాక్‌పై ఆధిపత్యం చలాయించిన టీమ్‌ఇండియాకు.. కొన్నేళ్లుగా పాక్‌ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురవుతోంది. శనివారం నాటి పోరులో ఫేవరెట్‌ రోహిత్‌ సేనే అయినా.. బాబర్‌ నేతృత్వంలోని పాక్‌ జట్టు అంత తేలిగ్గా లొంగే అవకాశం లేదు. కాబట్టి హోరాహోరీ పోరు ఖాయం కావచ్చు.

పల్లెకెలె

క్రికెట్‌ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూసే సూపర్‌ సమరానికి రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌ వన్డే టోర్నీలో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ శనివారం అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. పాకిస్థాన్‌ ఇప్పటికే నేపాల్‌ను చిత్తు చేసి టోర్నీని ఘనంగా ఆరంభించగా.. భారత్‌ ఈ మ్యాచ్‌తోనే తన పోరాటాన్ని మొదలుపెట్టబోతోంది. సుదీర్ఘ కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయి.. కేవలం ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో మాత్రమే తలపడుతుండటంతో భారత్‌-పాక్‌ పోరుపై నెలకొంటున్న ఆసక్తే వేరు. అయితే ఈ టోర్నీలన్నింట్లో పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం అన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లలో పాక్‌ బలం పెరిగినా.. అడపాదడపా కొన్ని విజయాలు సాధించినా.. ఇప్పటికే భారత్‌దే కాస్త పైచేయి. శనివారం కూడా రోహిత్‌ సేనే మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే ఎప్పట్లా బలమైన బౌలింగ్‌, ఈ మధ్య మెరుగుపడ్డ బ్యాటింగ్‌తో పాక్‌ ప్రమాదకరంగానే కనిపిస్తోంది. కాబట్టి భారత్‌.. విజయం కోసం కష్టపడాల్సిందే.

అతడితోనే ప్రధాన ముప్పు

పాక్‌ బౌలింగ్‌ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఇప్పుడు మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేశాక నిలకడగా రాణిస్తున్న ఫాస్ట్‌బౌలర్‌ షహీన్‌ అఫ్రిదితోనే భారత్‌కు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో అతను కొట్టిన దెబ్బను భారత్‌ అంత తేలిగ్గా మరిచిపోలేదు. నేపాల్‌తో ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో అతను అదరగొట్టాడు. ఆరంభంలో వేగం, లైన్‌ అండ్‌ లెంగ్త్‌ కలగలిపి అతను సంధించే బుల్లెట్‌ బంతులను ఎదుర్కోవడం బ్యాటర్లకు సవాలే. తొలి స్పెల్‌లో అతడితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పేసర్‌ అయిన హారిస్‌ రవూఫ్‌, యువ పేసర్‌ నసీమ్‌ షాలను కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ముందు వీరి బౌలింగ్‌ను ఆచితూచి ఎదుర్కొని నిలదొక్కుకున్నాక స్కోరు పెంచే ప్రయత్నం చేయాలి. ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌.. తర్వాత వచ్చే కోహ్లి ఈ త్రయాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం.

ఆసియా కప్‌లో భారత ‘బలగం’.. అదరగొట్టేదెవరు?

2019 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై మెరుపు శతకం బాదిన రోహిత్‌.. ఇప్పుడు కెప్టెన్‌గా అలాంటి ఇన్నింగ్స్‌తోనే జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. తొలిసారి పాక్‌ను ఎదుర్కొనబోతున్న శుభ్‌మన్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. గాయం తర్వాత పునరాగమనం చేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ మీద అందరి దృష్టీ నిలిచి ఉంది. మిడిలార్డర్లో హార్దిక్‌ కీలకం కానున్నాడు. జడేజా కూడా చివర్లో మెరుపులు మెరిపిస్తాడని జట్టు ఆశిస్తోంది. మధ్య ఓవర్లలో స్పిన్‌ త్రయం షాదాబ్‌, నవాజ్‌, అఘా సల్మాన్‌లను పాక్‌ ప్రయోగించబోతోంది.


పిచ్‌ బౌలర్లదే

ఆసియా కప్‌లో భాగంగా పల్లెకెలెలో ఇప్పటికే ఓ మ్యాచ్‌ జరిగింది. అందులో బంగ్లాదేశ్‌ అతి కష్టం మీద 164 పరుగులు చేస్తే.. చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి ఆతిథ్య జట్టు శ్రీలంక కూడా కష్టపడాల్సి వచ్చింది. అదే వేదికలో భారత్‌, పాక్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వేరే పిచ్‌ వాడబోతున్నప్పటికీ.. అది కూడా బౌలర్లకే ఎక్కువ అనుకూలమని అంచనా. పేసర్లకు, స్పిన్నర్లకు సమానంగా పిచ్‌ సహకరిస్తుందని సమాచారం. బ్యాటర్లు కష్టపడాల్సిందే. నిలదొక్కుకుంటే పరుగులు చేయొచ్చు. ఈ పిచ్‌పై 250 ఛేదన కూడా కష్టమే కావచ్చు.


కింగ్‌ కొడతాడా?

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే బ్యాటింగ్‌లో అందరి దృష్టీ కోహ్లి మీదికే మళ్లుతుంది. ఆ జట్టుపై అతడికి మంచి రికార్డుంది. పాక్‌పై 13 వన్డేల్లో 48.72 సగటుతో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా 536 పరుగులు చేశాడు విరాట్‌. టీ20ల్లో ఆ జట్టుపై 10 మ్యాచ్‌లాడి 81.33 సగటుతో 488 పరుగులు సాధించాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో విరాట్‌ అసాధారణంగా పోరాడి జట్టును గెలిపించాడు. పాక్‌తో మ్యాచ్‌ అనగానే కోహ్లిలో కసే వేరుగా ఉంటుంది. అందుకే శనివారం కూడా అతడి నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.


బుమ్రా జోరు చూస్తామా?

వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తుండగా ప్రధాన పేసర్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించడం భారత్‌కు సానుకూలాంశం. ఇప్పటికే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో బరిలోకి దిగి ఫిట్‌నెస్‌, ఫామ్‌ను చాటుకున్న బుమ్రా.. వన్డే మ్యాచ్‌ల్లో ఎలా బౌలింగ్‌ చేస్తాడన్నది ఆసక్తికరం. అతను ఆసియా కప్‌లో పూర్తి స్థాయిలో సత్తా చాటితే ప్రపంచకప్‌ ముంగిట బౌలింగ్‌ పరంగా భారత్‌ ఆత్మవిశ్వాసం ఎంతో పెరుగుతుంది. బుమ్రా లేని సమయంలో ప్రధాన బౌలర్‌గా వ్యవహరించిన సిరాజ్‌పైనా మంచి అంచనాలున్నాయి. శార్దూల్‌ నుంచి పోటీ ఉన్నప్పటికీ షమినే మూడో పేసర్‌గా తుది జట్టులో ఉండే అవకాశముంది. లయ అందుకున్న బాబర్‌ అజామ్‌.. ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌లను భారత బౌలర్లు ఏమేర కట్టడి చేస్తారో చూడాలి. ముఖ్యంగా అజామ్‌, రిజ్వాన్‌ల నుంచి బౌలర్లకు ముప్పు పొంచి ఉంది. స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్న జడేజా, కుల్‌దీప్‌లపైనా భారత్‌ చాలా ఆశలు పెట్టుకుంది.


తుది జట్లు

భారత్‌ (అంచనా): రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, జడేజా, కుల్‌దీప్‌, షమి, బుమ్రా, సిరాజ్‌.
పాకిస్థాన్‌: ఇమాముల్‌ హక్‌, ఫఖర్‌ జమాన్‌, బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌), ఇఫ్తికార్‌ అహ్మద్‌, అఘా సల్మాన్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, హారిస్‌ రవూఫ్‌, షహీన్‌ అఫ్రిది, నసీమ్‌ షా.


వరుణుడు కరుణిస్తాడా?

భారత్‌-పాక్‌ పోరుకు వర్షం ముప్పుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. శ్రీలంకలో ఈ సమయంలో వర్షాలు మామూలే. మ్యాచ్‌ వేదికైన పల్లెకెలెలో శనివారం వర్షం పడే సంకేతాలున్నాయి. మొత్తం మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేకపోయినా.. వర్షం వల్ల మ్యాచ్‌ సమయానికి మొదలు కాకపోవచ్చు. మ్యాచ్‌ మధ్యలో కూడా వరుణుడు అంతరాయం కలిగించవచ్చు. అయితే వర్షం ఇబ్బంది పెట్టినా.. మ్యాచ్‌ పూర్తయి ఫలితం వస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.


2011 తర్వాత ఇదే ఉత్తమ జట్టు: రవిశాస్త్రి

పల్లెకెలె: 2011 ప్రపంచకప్‌ తర్వాత ప్రస్తుత రోహిత్‌ సేనే భారత్‌కు ఉత్తమ వన్డే జట్టని మాజీ కెప్టెన్‌, కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతంతో పోలిస్తే పాక్‌ జట్టు మెరుగైందని కూడా అతనన్నాడు. ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ పోరు ముంగిట రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌ అని నా అభిప్రాయం. 2011 తర్వాత అత్యంత బలమైన భారత వన్డే జట్టు ఇదే. జట్టుకు అవసరమైన అన్ని రకాల ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అనుభవజ్ఞుడైన, అన్ని విషయాలనూ బాగా అర్థం చేసుకునే కెప్టెన్‌ ఉండటం సానుకూలత. అయితే ఏడెనిమిదేళ్ల కిందట భారత్‌-పాక్‌ మధ్య చాలా అంతరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అంతరాన్ని పాక్‌ చాలా వరకు తగ్గించింది. ఇప్పుడది ఎంతో మెరుగైన జట్టు. ఉత్తమ ప్రదర్శన చేస్తోంది’’ అని రవిశాస్త్రి అన్నాడు. పాక్‌తో మ్యాచ్‌ కదా అని టీమ్‌ఇండియా ఎక్కువ ఆలోచించకుండా, దీన్ని కూడా మామూలు పోరుగానే చూడాలని రవిశాస్త్రి సూచించాడు.


‘‘మా జట్టులో షహీన్‌, నసీమ్‌, రవూఫ్‌ లేరు. మాకు అందుబాటులో ఉన్న బౌలర్లతోనే నెట్స్‌లో సాధన చేశాం. వాళ్లు నాణ్యమైన బౌలర్లనడంలో సందేహం లేదు. పాక్‌ బౌలర్లను ఎదుర్కోవడానికి మా అనుభవాన్ని ఉపయోగించుకుంటాం. ఆసియా కప్‌ను పరీక్షించుకోవడానికి వేదికగా చూడట్లేదు. ఆసియాలో టాప్‌-6 జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ స్థాయి పెద్దది. మా ఫిట్‌నెస్‌ పరీక్ష, శిబిరం బెంగళూరులోనే ముగిశాయి. ఇప్పుడిక టోర్నీ గెలవడం మీదే మా దృష్టి. తుది జట్టులో స్థానం కోసం ఎక్కువ పోటీ ఉండటం, మెరుగైన ఆటగాళ్ల మధ్య ఎవరిని ఎంచుకోవాలో తెలియని సందిగ్ధత ఉండటం మంచిదే. శ్రీలంక పిచ్‌లపై ఆడటం బ్యాటర్లకు సవాలే. కానీ మా జట్టులో అనుభవజ్ఞులైన బ్యాటర్లున్నారు’’

రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌


4

చివరగా పాకిస్థాన్‌తో తలపడ్డ  5 వన్డేల్లో భారత్‌ సాధించిన విజయాలు. వన్డేల్లో పాక్‌  చివరగా 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించింది.


102

వన్డేల్లో 13 వేల మైలురాయిని అందుకోవడానికి కోహ్లికి అవసరమైన పరుగులు. శనివారం ఈ ఘనత సాధిస్తే.. 266వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని అందుకుని ప్రపంచ రికార్డు నమోదు చేస్తాడు. సచిన్‌ 321 ఇన్నింగ్స్‌లతో రికార్డు నెలకొల్పాడు.


19

బాబర్‌ అజామ్‌ వన్డే శతకాలు. మరొకటి సాధిస్తే.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు కొట్టిన పాక్‌ బ్యాటర్‌గా సయీద్‌ అన్వర్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు.


6

వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి జడేజాకు అవసరమైన వికెట్లు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు