IND vs SA: నువ్వా.. నేనా!

వారెవా శార్దూల్‌! ప్రధాన పేసర్ల జోరు తగ్గిన వేళ.. సంచలన బౌలింగ్‌తో వికెట్ల పండగ చేసుకున్న అతడు టీమ్‌ఇండియాను పోటీలో నిలిపాడు. దక్షిణాఫ్రికాకే స్వల్ప ఆధిక్యం దక్కినా రెండో టెస్టు రసవత్తరం. ప్రస్తుతానికి రెండు జట్లూ దాదాపు సమాన స్థితిలో ఉన్నాయి. మ్యాచ్‌లో ఆధిపత్యం కోసం గట్టిగా పోరాడుతున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లిద్దరినీ కోల్పోయిన భారత్‌.. 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమ్‌ఇండియా కాస్త ఇబ్బందుల్లో పడ్డట్లు కనిపించినా  కెరీర్‌ నిర్ణాయక స్థితిలో పుజారా ధాటిగా ఆడి పరిస్థితిని మెరుగుపరిచాడు.

Updated : 05 Jan 2022 07:38 IST

ఆసక్తికరంగా రెండో టెస్టు

దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం

శార్దూల్‌కు ఏడు వికెట్లు

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 85/2

జొహానెస్‌బర్గ్‌

వారెవా శార్దూల్‌! ప్రధాన పేసర్ల జోరు తగ్గిన వేళ.. సంచలన బౌలింగ్‌తో వికెట్ల పండగ చేసుకున్న అతడు టీమ్‌ఇండియాను పోటీలో నిలిపాడు. దక్షిణాఫ్రికాకే స్వల్ప ఆధిక్యం దక్కినా రెండో టెస్టు రసవత్తరం. ప్రస్తుతానికి రెండు జట్లూ దాదాపు సమాన స్థితిలో ఉన్నాయి. మ్యాచ్‌లో ఆధిపత్యం కోసం గట్టిగా పోరాడుతున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లిద్దరినీ కోల్పోయిన భారత్‌.. 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమ్‌ఇండియా కాస్త ఇబ్బందుల్లో పడ్డట్లు కనిపించినా  కెరీర్‌ నిర్ణాయక స్థితిలో పుజారా ధాటిగా ఆడి పరిస్థితిని మెరుగుపరిచాడు.

భారత్‌-దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో ఏ జట్టుదీ ఆధిపత్యం అని చెప్పలేం. ఆతిథ్య జట్టుకు టీమ్‌ఇండియా 27 పరుగుల స్పల్ప ఆధిక్యం కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా.. శార్దూల్‌ ఠాకూర్‌ (7/61) ధాటికి 229 పరుగులకు ఆలౌటైంది. కీగన్‌   పీటర్సన్‌ (62; 118 బంతుల్లో 9×4), తెంబా బవుమా (51; 60 బంతుల్లో 6×4, 1×6) విలువైన అర్ధశతకాలు సాధించారు. ఓ దశలో మంచి ఆధిక్యం సాధించే దిశగా సాగిన ఆతిథ్య జట్టుకు శార్దూల్‌ సంచలన బౌలింగ్‌తో కళ్లెం వేశాడు. మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. 44 పరుగులకే రాహుల్‌ (8), మయాంక్‌ (23)ల వికెట్లు కోల్పోయిన భారత్‌ ఒత్తిడిలో పడింది. అయితే పుజారా (35 బ్యాటింగ్‌; 42 బంతుల్లో 7×4) ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో పరిస్థితి మెరుగుపడింది. పుజారాకు తోడుగా రహానె (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఈ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారు. మూడో రోజు వీళ్లు ఎలా ఆడతారన్నదే మ్యాచ్‌ గమనంలో కీలకం. బంతి బాగా బౌన్సవుతున్న ఈ పిచ్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఛేదించడం దక్షిణాఫ్రికాకు కష్టమవుతుందని భావిస్తున్నారు.

పైచేయి సాధించినా..: రెండో రోజు భారత పేసర్లను దక్షిణాఫ్రికా గట్టిగానే ప్రతిఘటించింది. అంత తేలిగ్గా వికెట్లు ఇవ్వలేదు. ఉదయం సెషన్లో బుమ్రా, షమి ఎంతో శ్రమించినా ఫలితం రాబట్టలేకపోయారు. కానీ ఈసారి శార్దూల్‌ బాధ్యత తీసుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను   కొనసాగించగా.. కీగన్‌ పీటర్సన్‌, ఎల్గర్‌ పట్టుదలగా పోరాడారు. ఎల్గర్‌ దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ఓ వైపు పాతుకుపోయాడు. మరోవైపు పీటర్సన్‌ చక్కని షాట్లు కొట్టాడు. సోమవారం వరకు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 19 పరుగులే. కానీ ఈసారి విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. షమి బౌలింగ్‌లో ఓ అందమైన కవర్‌డ్రైవ్‌తో వచ్చిన బౌండరీ సహా అతడి ఇన్నింగ్స్‌లో మొత్తం 9 బౌండరీలు ఉన్నాయి. బవుమాతో రెండో వికెట్‌కు పీటర్సన్‌ 74 పరుగులు జోడించాడు. ఓ దశలో ఆతిథ్య  జట్టు 88/1తో బలమైన స్థితిలో నిలిచింది. భారత్‌ వెనుకబడ్డట్లు కనిపించింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో చాలా సౌకర్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో వికెట్‌ పడకుండానే దక్షిణాఫ్రికా  తొలి సెషన్‌ను ముగిస్తుందేమో అనిపించింది. కానీ లంచ్‌కు ముందు అరగంటలో శార్దూల్‌ ఠాకూర్‌ సంచలన బౌలింగ్‌తో టీమ్‌ఇండియాను బలంగా పోటీలోకి తెచ్చాడు. అప్పుడే కాదు.. విరామం తర్వాత కూడా ఠాకూర్‌ ఆతిథ్య జట్టును దెబ్బతీశాడు.

సూపర్‌ శార్దూల్‌: మరీ ఎక్కువ ఆధిక్యం సాధించకుండా దక్షిణాఫ్రికాను భారత్‌ అడ్డుకొని, పరిస్థితులు చేయి దాటిపోకుండా చూసుకోగలిగింది అంటే అందుకు ప్రధాన కారణం శార్దూల్‌ ఠాకూరే. ప్రధాన పేసర్లు వికెట్ల వేటలో వెనుకబడ్డ వేళ ఈ నాలుగో సీమర్‌ అనూహ్యంగా విజృంభించి భారత్‌ను పోటీలో నిలిపాడు. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన అతడు కీలక వికెట్లు పడగొట్టి, మెరుగైన స్కోరు దిశగా సాగుతున్న ఆతిథ్య జట్టును దెబ్బతీయడంతో టీమ్‌ఇండియా ఊపిరిపీల్చుకుంది. శార్దూల్‌ ధాటికి 14 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా.. 88/1 నుంచి 102/4కు చేరుకుంది. 4.5-3-8-3.. తొలి సెషన్లో శార్దూల్‌ గణాంకాలివి. అతడి బంతులు ఊరిస్తుంటాయి... కానీ అందులో ఏదో తేడా ఉంటుందని ఔటైన తర్వాత కానీ బ్యాట్స్‌మెన్‌కు అర్థం కాలేదు. వికెట్లు పడగొట్టడంలో తన చాతుర్యాన్ని మరోసారి చాటుకున్న అతడు.. మొదట ఎల్గర్‌ను ఔట్‌ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారుతున్న భాగస్వామ్యాన్ని విడదీశాడు. బయటికి వెళ్తున్న షార్ట్‌ పిచ్‌ బంతిని కెలికిన ఎల్గర్‌ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ పంత్‌కు చిక్కాడు. శార్దూల్‌ కాసేపటి తర్వాత పీటర్సన్‌నూ వెనక్కి పంపాడు. షమి ఓవర్లో ఏకంగా మూడు ఫోర్లు కొట్టి ఊపుమీదున్న పీటర్సన్‌.. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడి బయటికి వెళ్తున్న బంతిని డ్రైవ్‌ చేయబోయి ఎడ్జ్‌తో స్లిప్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత శార్దూల్‌ మరో చక్కని బంతితో డసెన్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడి లోపలికి దూసుకొచ్చిన బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జై వెళ్లగా పంత్‌ పట్టేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును భారత్‌ త్వరగా ఆలౌట్‌ చేసి ఆధిక్యం సంపాదిస్తుందేమో అనిపించింది. కానీ ఆ జట్టు అంత తేలిగ్గా తలవంచలేదు. బవుమా, వెరినె (21; 72 బంతుల్లో 2×4) పోరాటంతో మళ్లీ కోలుకుంది. పట్టుదలగా క్రీజులో నిలిచిన ఈ ఇద్దరు అయిదో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో ఓ దశలో దక్షిణాఫ్రికా   162/4తో మంచి ఆధిక్యంపై కన్నేసింది. కానీ అదిరే బౌలింగ్‌తో శార్దూల్‌ మరోసారి భారత్‌ను ఆదుకున్నాడు. ముందు వెరినెను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతడు.. కాసేపటి తర్వాత బవుమాను ఔట్‌ చేశాడు. లెగ్‌సైడ్‌ వచ్చిన షార్ట్‌ బంతిని బవుమా ఫ్లిక్‌ చేయాలనుకున్నాడు. కానీ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ పంత్‌ అందుకున్న చక్కని క్యాచ్‌కు నిష్క్రమించాడు. ఆ వెంటనే రబాడ (0)ను షమి వెనక్కి పంపాడు. అప్పటికి స్కోరు 179. జాన్సన్‌ (21)తో ఎనిమిదో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి దక్షిణాఫ్రికాను ఆధిక్యంలోకి తీసుకెళ్లిన కేశవ్‌ మహరాజ్‌ (21)ను బుమ్రా బౌల్డ్‌ చేశాడు. కాసేపటి తర్వాత ఒకే ఓవర్లో జాన్సన్‌, ఎంగిడిని ఔట్‌ చేయడం ద్వారా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌కు శార్దూల్‌ తెరదించాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 202

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 28; మార్‌క్రమ్‌ ఎల్బీ (బి) షమి 7; కీగన్‌ పీటర్సన్‌ (సి) మయాంక్‌ (బి) శార్దూల్‌ 62; వాండర్‌డసెన్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 1; బవుమా (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 51; వెరినె ఎల్బీ (బి) శార్దూల్‌ 21; జాన్సన్‌ (సి) అశ్విన్‌ (బి) శార్దూల్‌ 21; రబాడ (సి) సిరాజ్‌ (బి) షమి 0; కేశవ్‌ మహరాజ్‌ (బి) బుమ్రా 21; అలివీర్‌ నాటౌట్‌ 1; ఎంగిడి (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 0; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (79.4 ఓవర్లలో ఆలౌట్‌) 229; వికెట్ల పతనం: 1-14, 2-88, 3-101, 4-102, 5-162, 6-177, 7-179, 8-217, 9-228; బౌలింగ్‌: బుమ్రా 21-5-49-1; షమి 21-5-52-2; సిరాజ్‌  9.5-2-24-0; శార్దూల్‌ ఠాకూర్‌ 17.5-3-61-7; అశ్విన్‌ 10-1-35-0

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సన్‌ 8; మయాంక్‌ ఎల్బీ (బి) అలివీర్‌ 23; పుజారా బ్యాటింగ్‌ 34; రహానె బ్యాటింగ్‌ 11; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 85; వికెట్ల పతనం: 1-24, 2-44; బౌలింగ్‌: రబాడ 6-1-26-0; అలివీర్‌ 4-0-22-1; ఎంగిడి 3-1-5-0; జాన్సన్‌ 6-2-18-1; కేశవ్‌ మహరాజ్‌ 1-0-8-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని