IND vs SA: టీమ్‌ఇండియా ఘన విజయం.. కెప్టెన్లు ఏమన్నారంటే?

దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్‌ఇండియా విజయంతో ఆరంభించింది. సెంచురియాన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 191 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్

Updated : 30 Dec 2021 19:09 IST

సెంచురియాన్: దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్‌ఇండియా విజయంతో ఆరంభించింది. సెంచురియాన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 191 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (123) శతకంతో చెలరేగి మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిగిలిన రెండు టెస్టుల్లో టీమ్‌ఇండియా ఒక్క దాంట్లో గెలిచినా సిరీస్‌ని కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టిస్తుంది. కాగా, ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సౌతాఫ్రికా సారథి ఎల్గర్, కేఎల్‌ రాహుల్‌ మాట్లాడారు. 

షమి ప్రపంచస్థాయి బౌలర్: విరాట్ కోహ్లి 

‘ఈ పర్యటనలో మాకు శుభారంభం దక్కింది. వర్షం కారణంగా ఒక రోజు ఆట (రెండో రోజు) పూర్తిగా తుడిచిపొట్టుకుపోయినా మేము చాలా బాగా ఆడాం. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడటం ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. విదేశాల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించడానికి మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కారణం. బౌలర్లు రాణిస్తారని మాకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో మా బౌలర్లు సమష్టిగా బౌలింగ్ చేయడంతో జట్టు ఈ ఫలితాన్ని పొందింది. షమి కచ్చితంగా అద్భుతమైన, ప్రపంచస్థాయి బౌలర్‌. ప్రస్తుతం ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో అతడు ఒకడు’ అని విరాట్‌ పేర్కొన్నారు. 

రెండు జట్ల మధ్య తేడా అదే: ఎల్గర్‌ 

‘తొలి టెస్ట్‌ ఓడిపోవడం బాధాకరం. మేం కొన్ని తప్పులు చేశాం. అయితే, కొన్ని సానుకూలతలు కూడా బయటికి వచ్చాయి. రాబోయే రెండు టెస్టుల్లో మేం వాటిని ఉపయోగించుకోవాలి. భారత ఓపెనర్లు రాణించారు. తొలుత మా బౌలర్లు సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేదు. కొన్నిసార్లు చర్చించిన తర్వాత బౌలింగ్‌లో మార్పు కనిపించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశాం. 20 వికెట్లు తీయడానికి మా బౌలర్లు పడిన కష్టాన్ని చెప్పలేం. మా బ్యాటర్లు నిరాశపరిచారు. రెండు జట్ల మధ్య బ్యాటింగ్‌లో తేడా ఉంది. ఈ విషయంపై జట్టు యాజమాన్యంతో చర్చించాలి’ అని ఎల్గర్‌ తమ జట్టు ఆటతీరు గురించి వివరించాడు. 

ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది: కేఎల్ రాహుల్‌ 

ఛాలెంజింగ్‌ పిచ్‌పై ఓపెనింగ్‌ భాగస్వామ్యం కీలకం. నా ఆటతీరు పట్ల నిజంగా సంతోషంగా ఉంది. నా ఆటలో చాలా సాంకేతిక మార్పులు చేశానని అనుకోవద్దు. ఇది నా మనస్తత్వం, ప్రశాంతత, క్రమశిక్షణలో వచ్చిన మార్పు. విదేశాల్లో మంచి ప్రదర్శన కనబరిచేందుకు క్రమశిక్షణతో నడుచుకోవడం ఎంతో ఉపయోగపడింది. విదేశాల్లో సెంచరీలు చేయడం పట్ల గర్వంగా ఉన్నా. మన ఫాస్ట్ బౌలింగ్‌ బృందం ఈరోజు మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాగా రాణిస్తోంది. షమీతోపాటు ఇతర బౌలర్లు మంచి ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సౌతాఫ్రికాకి రావడం చాలా ప్రత్యేకమైనది. ఈ విజయం మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. తర్వాతి టెస్టులో కూడా గెలవాలని కోరుకుంటున్నాను.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని