IND vs SA: రాజ్‌కోట్‌లో టీమ్‌ఇండియా గత రికార్డు ఎలా ఉందంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిధ్ధమైంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న పర్యాటక జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ సొంతం...

Published : 17 Jun 2022 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిధ్ధమైంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న పర్యాటక జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు విశాఖలో తొలి విజయం సాధించిన టీమ్‌ఇండియా ఇక్కడా విజయం సాధించి ఐదో టీ20ని మరింత ఉత్కంఠగా మార్చాలని భావిస్తోంది. దీంతో ఈ రోజు సాయంత్రం రాజ్‌కోట్‌ వేదికగా జరగబోయే నాలుగో టీ20 కీలకంగా మారింది. ఇక టీమ్‌ఇండియా గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఇషాన్‌, రుతురాజ్‌తో పాటు మిగిలిన బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌ సైతం మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేంద్ర చాహల్‌, హర్షల్‌ పటేల్‌ సైతం బాగా పుంజుకున్నారు. దీంతో టీమ్‌ఇండియా మరోసారి సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాపై విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఫామ్‌ ఒక్కటే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజైనా అతడు తన సహజశైలిలో విరుచుకుపడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కీలక సమరానికి ముందు రాజ్‌కోట్‌ పిచ్‌.. గత రికార్డులు, ఎలా ఉందో తెలుసుకుందాం..

భారత 2:1..

ఈ పిచ్‌పై భారత్‌ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడగా రెండు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడింది. 2013లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో.. 2019లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, 2017లో మాత్రం న్యూజిలాండ్‌ చేతిలో 40 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

పిచ్‌ ఎలా ఉందంటే..

మూడేళ్ల అనంతరం ఇక్కడ తొలిసారి టీ20 మ్యాచ్‌ జరుగుతోంది. రాజ్‌కోట్‌ది ఫ్లాట్‌ పిచ్‌ కావడంతో వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకులిస్తుంది. దీంతో ఇక్కడ పరుగుల వరద ఖాయమనిపిస్తోంది. టాస్‌ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షం కురిసే అవకాశం చాలా తక్కువ.

అత్యల్ప స్కోరు: 153 బంగ్లాదేశ్‌.. ఇండియాపై

అత్యధిక స్కోరు: టీమ్‌ఇండియా 202 (ఆస్ట్రేలియాపై ఛేదన)

మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు: 183

రెండో ఇన్నింగ్స్‌ సగటు స్కోరు: 170

అత్యధిక వ్యక్తిగత స్కోరు: కొలిన్‌ మన్రో (109) టీమ్‌ఇండియాపై

తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు ఒక్కసారే విజయం సాధించింది.

లక్ష్య ఛేదన చేసిన జట్లు రెండు సార్లు విజయాలు సాధించాయి.

రికార్డుల వేట: ఈ మ్యాచ్‌లో రిషబ్‌పంత్‌ మరో సిక్సర్‌ బాదితే అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని