IND vs SA: పుజారా, రహానె శక్తిమేరకు ప్రయత్నిస్తున్నారు: విక్రమ్‌ రాథోర్‌

ఫామ్‌కోల్పోయి సతమతమవుతున్న టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె మళ్లీ రాణించేందుకు శక్తిమేరకు ప్రయత్నిస్తున్నారని, వారిపై ఒత్తిడి...

Published : 30 Dec 2021 11:52 IST

సెంచూరియన్: ఫామ్‌కోల్పోయి సతమతమవుతున్న టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె రాణించేందుకు శక్తిమేరకు ప్రయత్నిస్తున్నారని, వారిపై ఒత్తిడి తీసుకురాకుండా జట్టు యాజమాన్యం వేచిచూసే వైఖరి అనుసరిస్తోందని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులోనూ వీరిద్దరు మరోసారి విఫలమైన నేపథ్యంలో బుధవారం మ్యాచ్ అనంతరం విక్రమ్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు.

‘పుజారా, రహానె మళ్లీ గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు 100 శాతం కష్టపడుతున్నారు. రహానె తిరిగి లయ అందుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు ఔటయ్యాడు. పుజారా కూడా రాణించలేదు. అతడు గతంలో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, దక్షిణాఫ్రికా పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసురుతాయి. ఇక్కడ ఎక్కువ మంది పరుగులు చేయలేదు. వాళ్లిద్దరూ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నంత కాలం ఓపికతో ఉండాలి. వాళ్లకు అత్యుత్తమ కోచింగ్‌ ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో మేమెంతో ఓపికతో ఉన్నాం’ అని విక్రమ్‌ చెప్పుకొచ్చాడు.

పుజారా, రహానె గతకొద్దికాలంగా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేక ఇబ్బందులు పడుతున్నారు. పుజారా అడపాదడపా అర్థశతకాలు సాధించినా ఈ మధ్య పూర్తిగా విఫలమవుతున్నాడు. మరోవైపు రహానె గతేడాది మెల్‌బోర్న్‌ టెస్టులో శతకం తర్వాత మరో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. దీంతో వీరిద్దరిపైనా అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని