IND vs SA: ఇక మిగిలింది టెస్టు కెప్టెన్సీనే.. కోహ్లీ మెడపై ఇంకో కత్తి..!

టీమ్‌ఇండియా సారథిగా విరాట్‌ కోహ్లీది తిరుగులేని రికార్డు. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేదనే కారణం పక్కనపెడితే సారథిగా గంగూలీ, ధోనీలాంటి దిగ్గజాలకు ఏ మాత్రం తక్కువ కాదు...

Published : 10 Dec 2021 01:35 IST

దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత విరాట్‌ పరిస్థితి ఏంటి?

టీమ్‌ఇండియా సారథిగా విరాట్‌ కోహ్లీది తిరుగులేని రికార్డు. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేదనే విషయాన్ని పక్కనపెడితే సారథిగా గంగూలీ, ధోనీలాంటి దిగ్గజాలకు ఏ మాత్రం తక్కువ కాదు. ఆటగాడిగా ఆకట్టుకుంటూ.. ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బదులిస్తూ.. కెప్టెన్‌గా నిలకడైన విజయాలు సాధిస్తూ.. ఇన్నాళ్లూ జట్టులో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన అతడు అనూహ్య పరిస్థితుల నడుమ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఒకరకంగా అతడికి ఇబ్బందికరమే అయినా మరో రకంగా మంచిదనే చెప్పాలి. ఎందుకంటే విరాట్‌ గత రెండేళ్లుగా స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు కేవలం టెస్టు కెప్టెన్సీకే పరిమితమైతే కొంచమైనా అతడిపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో బ్యాటింగ్‌లో పూర్వవైభవం సంపాదించే అవకాశం ఉంది. అలాగైనా అభిమానులు కోహ్లీ నుంచి భవిష్యత్‌లో పరుగుల వరద ఆశించే అవకాశం ఉంది.

అసలేం జరిగింది..?

కోహ్లీ చివరిసారి సెంచరీ కొట్టింది 2019 నవంబర్‌లో. అప్పుడు బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి డే/నైట్‌ టెస్టులోనే విరాట్‌ 70వ అంతర్జాతీయ శతకం సాధించాడు. ఆ తర్వాత రెండేళ్లుగా ఒక్క మూడంకెల స్కోర్‌ అందుకోలేకపోయాడు. జట్టుని ఎంత బాగా నడిపిస్తున్నా 71వ సెంచరీ సాధించలేకపోతున్నాడు. నీళ్లు తాగినంత తేలిగ్గా ఇదివరకు శతకాల మీద శతకాలు బాదిన కోహ్లీ ఈ రెండేళ్లలో ఒక్కసారి కూడా ఆ ఫీట్‌ అందుకోలేకపోయాడు. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్‌ పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఒకేసారి మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేపట్టడం, తీరిక లేని బిజీ షెడ్యూల్‌ ఆడటం, అతడిపై భారీ అంచనాలు ఉండటం, ప్రధాన ట్రోఫీలు సాధించలేకపోవడం.. ఇలాంటి మానసిక ఒత్తిడి పరిస్థితుల్లోనూ జట్టును విజయవంతంగా నడిపించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత గతేడాది న్యూజిలాండ్‌ పర్యటనలో 2 టెస్టుల సిరీస్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కివీస్‌తోనే ఓటమి.. ఈ రెండు మినహా టీమ్‌ఇండియా అన్ని సిరీస్‌లు సాధిస్తూ వచ్చింది. అయితే, ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశకు ముందు కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు స్వయంగా ప్రకటించాడు. అటు ఆర్సీబీ సారథిగా, ఇటు భారత జట్టు టీ20 సారథిగా తనంతట తానే వైదొలిగాడు.

ఆ నాలుగే దెబ్బకొట్టాయి..!


 

కోహ్లీ 2014లో తొలిసారి టీమ్‌ఇండియా టెస్టు పగ్గాలు అందుకున్నాడు. మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆ ఫార్మాట్‌ నుంచి తప్పుకొని కోహ్లీకి సుదీర్ఘ ఫార్మాట్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే, అదే సీజన్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా కోహ్లీ ఆటగాడిగా రాణించినా కెప్టెన్‌గా విఫలమయ్యాడు. కానీ, తర్వాత వరుస విజయాలు సాధిస్తూ టెస్టు క్రికెట్‌లోనే టీమ్‌ఇండియా తరఫున అత్యుత్తమ సారథిగా ఎదిగాడు. అతడి సారథ్యంలో భారత్‌.. 66 టెస్టుల్లో 39 విజయాలు సాధించింది. దీంతో టెస్టుల్లో కోహ్లీ విజయశాతం 59.09గా నమోదైంది. ఇది మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక సారథి ధోనీ (45%) కన్నా ఎంతో మెరుగైంది. ఈ క్రమంలోనే 2018-19 సీజన్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ సారథ్యంలోనే తొలిసారి చారిత్రక సిరీస్‌ గెలిచింది. అలాంటి విరాట్‌ అటు వన్డే, ఇటు టీ20 క్రికెట్‌లోనూ జట్టును మెరుగైన స్థితిలోనే నడిపించాడు. కానీ, 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, 2019 వన్డే సెమీఫైనల్‌, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, 2021 టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యాలే.. ఇప్పుడు అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నూ కెప్టెన్సీకి దూరం చేశాయి.

ఎందుకీ కఠిన నిర్ణయం?

దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా జట్టును ప్రకటించడానికి ముందే సెలెక్షన్‌ కమిటీ.. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అతడి అభిప్రాయం కోసం కూడా వేచిచూసినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కోహ్లీ నుంచి ఏవిధమైన స్పందన రాకపోవడంతో సెలెక్షన్‌ కమిటి ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అదే 2023 వన్డే ప్రపంచకప్‌. ఎలాగూ రోహిత్‌ ఇటీవల టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. వచ్చే ఏడాది 2022 టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో అతడిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే.. రోహిత్‌ ఇదివరకే ఐపీఎల్‌లో ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అలాగే కోహ్లీ లేని సమయంలో 2018 ఆసియాకప్‌లో టీమ్‌ఇండియాను విజేతగా నిలబెట్టిన అనుభవం అతడిది. ఇలాంటి పరిస్థితుల్లో వన్డే సారథ్య బాధ్యతలు కూడా అతడికే అప్పగిస్తే 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు టీమ్‌ఇండియాను మెరుగైన స్థితిలో నడిపిస్తాడని సెలెక్షన్‌ కమిటి భావించి ఉండొచ్చు. దీంతో ఇప్పటి నుంచే జట్టును నడిపించే బాధ్యతలు అప్పగించి ఉండొచ్చు.

కోహ్లీ మెడపై ఇంకో కత్తి..!

పైన పేర్కొన్న విషయాలన్నీ పక్కనపెడితే.. ఇప్పుడు కోహ్లీ మెడపై ఇంకో కత్తి వేలాడుతుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానెను ఇదే దక్షిణాఫ్రికా పర్యటనకు ఆ బాధ్యతల నుంచి తప్పించారనే సంగతి తెలిసిందే. ఆ వైస్‌ కెప్టెన్సీ కూడా రోహిత్‌కే ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఈ టెస్టు సిరీస్‌లో కోహ్లీ సారథ్యం వహిస్తే.. రోహిత్‌ అతడి డెప్యూటీగా ఉంటాడు. అలాగే దక్షిణాఫ్రికాలో భారత్‌ ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియాలో రాణించినట్టే ఇక్కడా కోహ్లీ టెస్టు సిరీస్‌ గెలిపిస్తే.. ఇది కూడా చారిత్రక ఘట్టం అవుతుంది. అయితే, ఇక్కడ కోహ్లీ కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ రాణించాలి. ఎందుకంటే రహానె, పుజారా లాంటి సీనియర్లు కూడా గత కొంత కాలంగా ఏమాత్రం ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ ఆడటం లేదు. మరోవైపు పలువురు యువకులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో రహానె, పుజారాలకు ఈ పర్యటన కీలకం కానుంది. వీరిద్దరూ ఇక్కడ కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇదే వారికి చివరి సిరీస్‌ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సైతం భారీ ఇన్నింగ్స్‌ ఆడి మునుపటి ఫామ్‌ అందుకోవాలి. లేదంటే టెస్టు కెప్టెన్సీ కూడా కోల్పోయే ప్రమాదం లేకపోలేదని క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని