IND vs SL 2023: టీ20 జట్టులో విరాట్‌ కోహ్లీ పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయా: సబా కరీమ్‌

మరికొన్ని రోజుల్లో స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కోసం విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్‌ అన్నారు.  

Published : 31 Dec 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్: జనవరి 3 నుంచి భారత్‌, శ్రీలంక (IND vs SL) మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌, అదే నెల 10 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya), వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మ (Rohit Sharma) సారథ్యం వహించనున్నారు. ఈ పొట్టి సిరీస్‌కు  సీనియర్‌ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) దూరంగా ఉన్నారు. కోహ్లీ గైర్హాజరుపై భారత మాజీ ఆటగాడు సబా కరీమ్‌ స్పందించాడు. టీ20 ప్రపంచకప్‌లోరాణించిన కోహ్లీ.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌కు కొంతమంది ఆటగాళ్లు ఎంపికకాకపోయినంత మాత్రాన వారికి తలుపులు మూసుకుపోయినట్లు భావించకూడదని పేర్కొన్నాడు. 

‘శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీకి మినహాయింపు ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అతడికి అంతర్జాతీయ టీ20ల్లో ప్రత్యేకమైన పాత్ర ఇచ్చారు. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ తిరుగులేని ఆటగాడు. కోహ్లీ టీ20 ప్రపంచ కప్‌లో ఆడకపోతే మనం పాకిస్థాన్‌పై ఓడిపోయేవాళ్లం. ఈ ఫార్మాట్‌లో అతడు జట్టుకు గొప్ప స్థిరత్వాన్ని అందించాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికవ్వని ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రాలేరని అనుకోవద్దు. కొంతమంది కొత్త కుర్రాళ్ళు రాణించకపోతే వారు ఆ స్థానాలను భర్తీ చేయవలసి ఉంటుంది’ అని సబా కరీమ్‌ వివరించాడు. 

ఇదిలా ఉండగా.. కేఎల్ రాహుల్ వివాహం వచ్చే నెలలో బాలీవుడ్ నటి అతియా శెట్టితో జరగనుంది. పెళ్లి పనుల కోసమే లంకతో పొట్టి సిరీస్‌కు రాహుల్‌ దూరమైనట్లు తెలుస్తోంది. కోహ్లీ గైర్హాజరుకు సంబంధించిన ఇటు విరాట్‌ నుంచి గానీ, బీసీసీఐ నుంచి గానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. శ్రీలంకతో జనవరి 10 నుంచి ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం కేఎల్‌ రాహుల్‌, కోహ్లీ అందుబాటులో ఉండనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు