Ravindra Jadeja: జడ్డూ ఇంత బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని దాచుకున్నాడా?

రవీంద్ర జడేజా అంటే ప్రధానంగా అతడి బౌలింగ్‌ మీదే దృష్టి ఉండేది ఒకప్పుడు. బ్యాటింగ్‌లో రాణిస్తే అది బోనస్‌గా భావించేవాళ్లు. అతణ్ని నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా పరిగణించడానికి వెనుకాడేవాళ్లు....

Updated : 06 Mar 2022 14:57 IST

ఈనాడు క్రీడావిభాగం: రవీంద్ర జడేజా అంటే ప్రధానంగా అతడి బౌలింగ్‌ మీదే దృష్టి ఉండేది ఒకప్పుడు. బ్యాటింగ్‌లో రాణిస్తే బోనస్‌గా భావించేవాళ్లు. అతణ్ని నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా పరిగణించడానికి వెనుకాడేవాళ్లు. కానీ ఇప్పుడు కథ మారుతోంది. బ్యాటింగ్‌లో అసాధారణ ప్రదర్శనతో తనపై అభిప్రాయాన్ని మార్చేస్తున్నాడు జడ్డూ. బౌలింగ్‌లో రాణిస్తూనే.. బ్యాట్స్‌మెన్‌గా తన ప్రతిభను బయటికి తీస్తున్నాడు. జడ్డూ ఇంత బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని ఇన్నాళ్లూ ఎక్కడ దాచుకున్నాడు ? అని అభిమానులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇటు అంతర్జాతీయ క్రికెట్లో, అటు ఐపీఎల్‌లో జడేజా బ్యాటుతో నిలకడగా రాణిస్తున్నాడు.

ఇంతకుముందు లోయర్‌ మిడిలార్డర్లో బ్యాటింగ్‌ చేసే అతడిని.. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో 5, 6 స్థానాల్లో ఆడించడానికి కారణం ఈ నిలకడే. ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను మించి వీర విహారం చేసి ఔరా అనిపించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో మూడు ట్రిపుల్‌ సెంచరీలు బాదిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో తన బ్యాటింగ్‌ ప్రతిభకు న్యాయం చేయట్లేదనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఇన్నాళ్లకు అతను ఒక భారీ ఇన్నింగ్స్‌తో బ్యాట్స్‌మన్‌గా తన స్థాయిని చాటిచెప్పాడు. శనివారం జడేజా ఉన్న ఊపులో ఇంకో మూణ్నాలుగు ఓవర్లు ఆడి ఉంటే డబుల్‌ సెంచరీ కూడా పూర్తయి ఉండేది. కానీ అప్పటికే స్కోరు 570 దాటిపోవడం, చివరి సెషన్లో ప్రత్యర్థి వికెట్లు వీలైనన్ని తీస్తే మ్యాచ్‌పై పట్టు బిగుస్తుందన్న ఉద్దేశంతో జడేజానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయాలని కెప్టెన్‌కు సూచించి వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని చాటాడు. నిఖార్సయిన ఆల్‌రౌండర్లు ఉంటే ఏ జట్టుకైనా అది పెద్ద బలమే. భారత్‌కు ఆ బలం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పుడు జడేజా ఈ స్థాయిలో రాణించడం మంచి పరిణామం. అతడితో పాటు అశ్విన్‌ కూడా బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తుండటం జట్టు బ్యాటింగ్‌ లోతును పెంచేదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని