IND vs SL: ‘రోహిత్‌ ఆరంభం అదుర్స్‌.. ఫీల్డర్లు ఉన్న చోటుకే క్యాచ్‌లొచ్చాయి’

టెస్టు సారథిగా రోహిత్‌ శర్మకు శుభారంభం లభించిందని, అతడు కెప్టెన్‌గా పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురపించాడు...

Published : 07 Mar 2022 14:48 IST

రోహిత్‌ సారథ్యంపై గావస్కర్‌ ప్రశంసలు

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టు సారథిగా రోహిత్‌ శర్మకు శుభారంభం లభించిందని, అతడు కెప్టెన్‌గా పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో గావస్కర్‌ మాట్లాడాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీని మెచ్చుకొన్నాడు.

‘కెప్టెన్‌గా రోహిత్‌కు అద్భుతమైన ఆరంభం దొరికింది. ఎవరైనా మూడు రోజుల్లోనే విజయం సాధిస్తే.. ఆ జట్టు ఎంత బలమైనదో తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ టెస్టులో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ చేసేటప్పుడు బౌలింగ్‌లో చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి. అలాగే ఫీల్డర్లు ఉన్న చోటుకే క్యాచ్‌లు వచ్చాయి. దీంతో మైదానంలోని ఫీల్డర్లు ఎక్కువగా కదలాడాల్సిన అవసరం రాలేదు. సరైన ఫీల్డింగ్‌ సెట్‌చేయడమే అందుకు నిదర్శనం. బౌలింగ్‌లోనూ రవీంద్ర జడేజాకు కీలక సమయంలో బౌలింగ్‌ ఇచ్చాడు. చివరికి టీమ్‌ఇండియా రెండు రోజులు మిగిలుండగానే మ్యాచ్‌ను గెలిచింది. నేనైతే రోహిత్‌ కెప్టెన్సీకి 9.5/10 రేటింగ్‌ ఇస్తా’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

అలాగే మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ సైతం రోహిత్‌ కెప్టెన్సీపై హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో అతడు కీలక నిర్ణయాలు తీసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో ఏ జట్టూ పెద్దగా ఫాలోఆన్‌ ఆడించడం లేదని, కానీ.. రోహిత్‌ శ్రీలంక జట్టును ఫాలోఆన్‌ ఆడించాడని గుర్తుచేశాడు. దీంతో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని పేర్కొన్నాడు. మరోవైపు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ టెస్టుల్లో అత్యద్భుతమైన ఫలితాలు సాధించినా కొన్ని విషయాల్లో రోహిత్ మెరుగ్గా ఉన్నాడన్నాడు. రోహిత్‌కు జట్టు కూర్పు సరిపోయిందని, దీంతో తొలి టెస్టులో మంచి విజయం సాధించాడని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని