Virat Kohli: పింక్‌ బాల్‌ టెస్టులో విరాట్‌ కోహ్లీకి భలే ఛాన్స్‌..

రెండేళ్లకు పైగా శతక నిరీక్షణ కొనసాగిస్తున్న కోహ్లీకి దానికి ముగింపు పలికేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాకపోవచ్చు..

Published : 12 Mar 2022 07:25 IST

బెంగళూరు: రెండేళ్లకు పైగా శతక నిరీక్షణ కొనసాగిస్తున్న కోహ్లీకి దానికి ముగింపు పలికేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాకపోవచ్చు. చివరగా అతను అంతర్జాతీయ శతకం చేసింది డేనైట్‌ టెస్టు (2019లో బంగ్లాదేశ్‌పై 136)లోనే కావడం విశేషం. మళ్లీ ఇప్పుడు గులాబి బంతి పోరు అతణ్ని ఊరిస్తోంది. పైగా తనకు రెండో ఇల్లు లాంటి చిన్నస్వామి స్టేడియం.. కోహ్లి 71వ శతక సంబరాల కోసం ఎదురు చూస్తోంది. తనకెంతో ప్రత్యేకమైన ఈ చోట.. పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియంలో.. అతను సెంచరీ అందుకుంటే చూడాలన్నది భారత అభిమానుల కోరిక. టెస్టుల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత అతను తొలిసారి మూడంకెల స్కోరు అందుకుంటే అంతకుమించి ఇంకేం కావాలి. కోహ్లి ఫామ్‌ బాగానే ఉంది. ఉత్తమంగానే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు అలవోకగా శతకాలు బాదిన అతనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే అతని సెంచరీ కోసం అభిమానులు ఇంతలా ఎదురు చూస్తున్నారు. తన వందో టెస్టులో ఎలాగో ఆ ముచ్చట తీరలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఆ ఎదురు చూపులకు కోహ్లి తెరదించుతాడేమో చూడాలి. గత మ్యాచ్‌లో చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్నట్లు కనిపించిన అతను.. స్పిన్నర్‌ ఎంబుల్దేనియా చేతికి చిక్కాడు. ఈ సారి అలాంటి పొరపాటు చేయకుండా ఉంటే వందను అందుకోవడం సాధ్యమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని