IND vs WI: వెంకటేశ్‌కు సవాలు విసిరాం.. ప్రతిసారీ అతడు మెరుగయ్యాడు: ద్రవిడ్‌

టీమ్‌ఇండియాలో సత్తా చాటుతున్న యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను చూసి హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ముచ్చటపడుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో...

Published : 21 Feb 2022 20:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాలో సత్తా చాటుతున్న యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను చూసి హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ముచ్చటపడుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో ఈ యువ ఆటగాడు మొత్తం 92 పరుగులు చేసి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్‌తో కలిసి ఫినిషర్‌గా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే విలువైన భాగస్వామ్యాలు నిర్మించి అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో గతరాత్రి టీమ్‌ఇండియా సిరీస్‌ కైవసం చేసుకున్నాక మీడియాతో మాట్లాడిన ద్రవిడ్‌ అయ్యర్‌పై ప్రశంసలల వర్షం కురిపించాడు.

‘ఐపీఎల్‌లో వెంకటేశ్‌ కోల్‌కతా జట్టుకు ఓపెనర్‌గా రాణిస్తున్నాడని తెలుసు. అయితే, టీమ్‌ఇండియాలో అతడు ఎలాంటి పాత్రలో సరిగ్గా సెట్‌ అవుతాడనే విషయంలో మేం చాలా స్పష్టతతో ఉన్నాం. కచ్చితంగా టాప్‌ త్రీలో ఉండలేడు. ఎందుకంటే ఇప్పటికే ఆ స్థానాల్లో కీలక ఆటగాళ్లు బాగా ఆడుతూ కొనసాగుతున్నారు. అందువల్లే అతడిని మిడిల్‌ ఆర్డర్‌లో పంపుతున్నాం. కావాలనే ఆ సవాలు విసిరాం. దీంతో బరిలోకి దిగిన ప్రతిసారీ ఆకట్టుకున్నాడు. ఎంతో మెరుగవుతున్నాడు. ఇది సంతోషించే విషయం’ అని ద్రవిడ్‌ మెచ్చుకున్నాడు.

అనంతరం వెంకటేశ్‌ బౌలింగ్‌పై స్పందిస్తూ.. ‘జట్టుకు అవసరమైనప్పుడు కెప్టెన్‌ ఆరో బౌలర్‌ను ఉపయోగించుకుంటాడు. అలాంటి సమయంలోనూ ఈ యువ ఆటగాడు ఆకట్టుకున్నాడు. ఆరో బౌలర్‌ అంటేనే కీలక సమయాల్లో బౌలింగ్‌ చేయడానికి ఉంటాడు. ఈ మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌కు గాయమైనప్పుడు వెంకటేశ్‌ 2.1 ఓవర్లు బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడ్డాడు. అతడికి ఈ సిరీస్‌ అద్భుతంగా నిలుస్తుంది’ అని టీమ్‌ఇండియా కోచ్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని