IND vs WI: రోహిత్‌ ఇలా తన్నడం సరికాదు.. హిట్‌మ్యాన్‌పై నెటిజన్ల ఆగ్రహం

టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భువనేశ్వర్‌ కుమార్‌.. రామన్‌ పావెల్‌ క్యాచ్‌ వదిలేసిన సంగతి తెలిసిందే...

Updated : 19 Feb 2022 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భువనేశ్వర్‌ కుమార్‌.. రామన్‌ పావెల్‌ క్యాచ్‌ వదిలేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర నిరాశకు గురైన హిట్‌మ్యాన్‌ ఆ బంతిని కోపంతో తన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన పలువురు టీమ్‌ఇండియా అభిమానులు.. కెప్టెన్‌గా ఉంటూ ఇలా చేయొద్దంటూ హితవు పలికారు. మ్యాచ్‌లో కొన్నిసార్లు ఇలాంటి తప్పులు జరుగుతాయని, అంతమాత్రాన కోపంతో, చిరాకుపడటం సరికాదని రోహిత్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్‌ 178/3 స్కోర్‌కే పరిమితమై.. 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే నికోలస్‌ పూరన్‌ (62), రామన్‌ పావెల్‌ (68*) మ్యాచ్‌ గెలిపించడానికి ప్రయత్నించారు. అయితే, భువి వేసిన 16వ ఓవర్‌లో ఓ షార్ట్‌పిచ్‌ బంతిని పావెల్‌ గాల్లోకి లేపాడు. భువనేశ్వర్‌ క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నించగా.. బంతి చేజారింది. అప్పటికి పరిస్థితి విండీస్‌కు అనుకూలంగా ఉండటంతో రోహిత్‌ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో కిందపడిన బంతిని తన కాలితో తన్నాడు. అయితే, చివరికి భువీనే 19వ ఓవర్‌లో కేవలం 4 పరుగులిచ్చి పూరన్‌ను ఔట్‌ చేయడంతో ఫలితం భారత్‌ వైపు మళ్లింది. దీంతో టీమ్‌ఇండియా విజయం సాధించడంలో ఈ పేస్‌ బౌలరే ప్రధాన కారణమని కూడా నెటిజన్లు కెప్టెన్‌కు చురకలు అంటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని