Ravi Bishnoi: అందుకే రవి బిష్ణోయ్‌ని నేరుగా తుది జట్టులోకి తీసుకున్నాం: రోహిత్‌

టీమ్‌ఇండియా అరంగేట్రం మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన చేసి అందరిచేతా శభాష్‌ అనిపించుకుంటున్న యువ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రశంసించాడు...

Updated : 17 Feb 2022 11:55 IST

కోల్‌కతా: టీమ్‌ఇండియా అరంగేట్రం మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన చేసి అందరిచేతా శభాష్‌ అనిపించుకుంటున్న యువ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌(2/17)ను కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రశంసించాడు. అతడి బౌలింగ్‌లో భిన్నత్వం ఉందని కొనియాడాడు. నిన్న రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ బిష్ణోయ్‌ బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. ‘బిష్ణోయ్‌ ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. అందుకే తొలి టీ20లోనే అతడిని నేరుగా తుది జట్టులోకి తీసుకున్నాం. అతడి బౌలింగ్‌లో భిన్నత్వం ఉంది. అతడు వేరియేషన్స్‌తో పాటు మంచి ప్రతిభాపాటవాలు కలిగినవాడు. ఏ సమయంలోనైనా బౌలింగ్ చేసే సత్తా ఉంది. దీంతో మేం ఇతర బౌలర్లను కూడా బాగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే రాణించడం చాలా సంతోషంగా ఉంది. అతడికి మంచి భవిష్యత్‌ ఉంది. అతడిని ఎలా ఉపయోగించుకుంటామనేది మా చేతుల్లోనే ఉంది’ అని హిట్‌మ్యాన్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌(35; 42 బంతుల్లో 4x4) కీలక సమయంలో ఔటవ్వడంపై మాట్లాడుతూ‌.. మధ్య ఓవర్లలో ఎలా ఆడాలనే విషయంపై చాలా రోజుల నుంచే అతడితో చర్చిస్తున్నట్లు చెప్పాడు. గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన అతడు.. స్లో పిచ్‌పై పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినట్లు రోహిత్‌ పేర్కొన్నాడు. దీంతో అతడికి జట్టు నుంచి పూర్తి సహకారం ఉంటుందనే భరోసా కల్పించామని చెప్పాడు. మధ్య ఓవర్లలో స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం చాలా ముఖ్యమైన విషయమని, ప్రస్తుతం ఇషాన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉండటంతో ఇంకాస్త సమయం ఇవ్వాలన్నాడు. అతడు బరిలోకి దిగినప్పుడల్లా ప్రశాంతంగా ఆడే పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని