IND vs SA: సఫారీల గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవడమే మా లక్ష్యం: విరాట్‌ కోహ్లీ

టీమ్‌ఇండియా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ సాధించలేకపోయిందని.. ఈ సారి ఎలాగైనా సిరీస్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉన్నట్లు టెస్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ..

Published : 16 Dec 2021 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ సాధించలేకపోయిందని.. ఈ సారి ఎలాగైనా సిరీస్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉన్నట్లు టెస్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత జట్టు గత పర్యటనలో దక్షిణాఫ్రికా చేతిలో 2-1 తేడాతో సిరీస్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వాండరర్స్ వేదికగా జరిగిన చివరి టెస్టులో భారత్‌ 63 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. ఆ తర్వాత అక్కడే జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా 5-0 తేడాతో కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.

‘గత దక్షిణాఫ్రికా పర్యటనలో మేం టెస్టు సిరీస్ కోల్పోయినా.. వన్డే సిరీస్‌ను 5-0 తేడాతో గెలుచుకున్నాం. కఠిన పిచ్‌లపై కూడా మా ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే ప్రస్తుత పర్యటనలో ఎలాగైనా టెస్టు సిరీస్‌ గెలవాలనే లక్ష్యంతో ఉన్నాం. సిరీస్ ఆరంభంలోనే పై చేయి సాధిస్తే.. సిరీస్‌ సాధించడం కష్టమేం కాదు. దక్షిణాఫ్రికాలో మేం ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా సాధించలేదు. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా సిరీస్‌లు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. ఇటీవల మా ఆటగాళ్లు విదేశీ పిచ్‌లపై మెరుగ్గా రాణిస్తున్నారు. క్రీజులో రోజంతా కొనసాగాలంటే ఎలా ఆడాలి? అనే విషయంపై ఆటగాళ్లకు అవగాహన వచ్చింది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది. డిసెంబరు 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు