IPL 2022: ధోనీని కలిసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి: శివమ్‌ దూబె

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. తన నాయకత్వ పటిమతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను..

Published : 22 Mar 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్ : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. తన నాయకత్వ పటిమతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. జట్లతో సంబంధం లేకుండా ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు కూడా ధోనీని అభిమానిస్తుంటారు. ఈ కోవలోకే వస్తాడు యువ ఆటగాడు శివమ్‌ దూబె. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలంలో చెన్నై యాజమాన్యం దూబెను రూ.4 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ధోనీకి వీరాభిమాని అయిన శివమ్‌ దూబె తొలిసారి అతడిని కలిసినప్పుడు కలిగిన అనుభూతిని తాజాగా పంచుకున్నాడు. ఆ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్‌ ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.

   

‘ఐపీఎల్‌ మెగా వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ నన్ను దక్కించుకోవడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎందుకంటే, సీఎస్కే కెప్టెన్‌ ధోనీకి నేను పెద్ద అభిమానిని. ఆ నిమిషం నా సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాలేదు. నాకు తెలియకుండానే డ్యాన్స్‌ చేశాను. వెంటనే నా భార్య, కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాను.  తర్వాత ధోనీని కలిసి కాసేపు మాట్లాడాను. నాకు కొన్ని సలహాలు చెప్పాడు. వాటిని కచ్చితంగా పాటిస్తాను. అతడితో మాట్లాడుతున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ సారి నా ఫ్రాంఛైజీ మారింది. కానీ, నా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. ఏ జట్టు తరఫున ఆడినా.. గొప్పగా రాణించేందుకు ప్రయత్నిస్తాను’ అని శివమ్‌ దూబె చెప్పాడు. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టు.. మార్చి 26న ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)తో తలపడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని