WTC Final: నల్ల రిబ్బన్లతో మైదానంలోకి క్రికెటర్లు.. ఎందుకంటే?

డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023) మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.

Published : 07 Jun 2023 16:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా జరుగుతోంది. టాస్‌ నెగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్, ఆసీస్‌ ఆటగాళ్లు తమ జాతీయ గీతాలాపన సందర్భంగా  నల్ల రిబ్బన్లను ధరించి మైదానంలో అడుగు పెట్టారు. ఇటీవల ఒడిశాలో భారీ రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 270 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మంది వరకు గాయపడ్డారు. దీంతో మృతి చెందిన వారికి సంతాపసూచికంగా ఆసీస్‌, భారత్‌ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించారు. ఈ సందర్భంగా మౌనం వహించి నివాళులర్పించారు. 

నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో టీమ్‌ఇండియా బరిలోకి దిగింది. సీనియర్‌ బౌలర్‌ అశ్విన్‌ను బెంచ్‌కే పరిమితం చేసిన టీమ్‌ఇండియా.. జడేజాను తీసుకుంది. అలాగే స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్ శ్రీకర్ భరత్‌ను ఎంపిక చేసుకుంది. టాస్‌ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘నలుగురు సీమర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాం. అలాగే స్పిన్నర్‌గా జడేజాను తీసుకున్నాం. రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్‌ను పక్కన పెట్టడం కఠిన నిర్ణయమే. అతడు మ్యాచ్‌ విన్నర్’’అని వ్యాఖ్యానించాడు. రోహిత్‌కిది 50వ టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం. బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌కు నాలుగో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను సిరాజ్‌ పెవిలియన్‌కు చేర్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని