IND vs PAK : స్లో ఓవర్‌ రేట్‌.. భారత్, పాక్‌ జట్లకు భారీ జరిమానా

స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత్, పాకిస్థాన్‌ జట్లకు 40 శాతం మ్యాచ్‌ ఫీజ్‌ను జరిమానాగా విధిస్తూ ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌లో భాగంగా...

Published : 01 Sep 2022 02:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత్, పాకిస్థాన్‌ జట్లకు 40 శాతం మ్యాచ్‌ ఫీజ్‌ను జరిమానాగా విధిస్తూ ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌లో భాగంగా గత ఆదివారం టీమ్‌ఇండియా‌-పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో పాక్‌పై భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే ఇరు జట్లూ తమ ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడంలో విఫలమైనట్లు మ్యాచ్ రిఫరీ నివేదించడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ ఫర్ ప్లేయర్స్‌ అండ్ ప్లేయర్‌ సపోర్ట్‌ పర్సనల్‌ సెక్షన్ ప్రకారం తమకు కేటాయించిన టైమ్‌కు ఒక్క ఓవర్‌ జాప్యమైతే 20 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటికే భారత్, పాక్‌ సారథులు రోహిత్ శర్మ, బాబర్‌ అజామ్‌ తమ తప్పును ఒప్పుకొన్నారని, ప్రతిపాదిత జరిమానాకు అంగీకరించారని ఐసీసీ వెల్లడించింది. దీంతో అధికారిక విచారణ అవసరం లేదని తెలిపింది. ఆ మ్యాచ్‌కు ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించిన మసుదుర్ రహ్మాన్‌, రుచిర పిల్లియగురుగె, మూడో అంపైర్‌ రవీంద్ర విమలసిరి, నాలుగో అంపైర్‌ గాజి సోహెల్‌ ఇరు జట్లపై అభియోగాలు మోపడంతో ఐసీసీ ప్యానెల్‌ జరిమానా విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని