ZIM vs IND: జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?

జింబాబ్వేతో టీ20 సిరీస్‌ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్‌లకు షాక్‌ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్‌ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది.

Published : 03 Jul 2024 18:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత యువ జట్టు జింబాబ్వేతో ఐదు టీ20ల(ZIM vs IND) సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పుడంటే జింబాబ్వే గొప్ప ప్రదర్శన చేయడం లేదు కానీ గతంలో ‘పసికూన’గా ఉంటూనే అద్భుతాలు సృష్టించిన చరిత్ర ఉంది. అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతో బలమైన జట్లకూ గట్టిపోటీనిచ్చేది. జింబాబ్వే-భారత్‌ ఇప్పటి వరకు మూడు ద్వైపాక్షిక సిరీసుల్లో తలపడ్డాయి. మొత్తం 8 టీ20లు ఇరు జట్ల మధ్య జరిగాయి. ఆరు మ్యాచుల్లో భారత్‌ గెలిచింది. రెండింట్లో జింబాబ్వే విజయం సాధించింది.

2010లో తొలిసారి.. 

జింబాబ్వేతో వారి సొంతమైదానాల్లో భారత్‌ ((Team India) తొలిసారి 2010లో రెండు టీ20ల సిరీస్‌ ఆడింది. టీమ్‌ఇండియానే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. సురేశ్ రైనా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. రోహిత్, విరాట్ కూడా జట్టులో సభ్యులే. తొలి మ్యాచ్‌లో యూసఫ్‌ పఠాన్ (37*) అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. ఇక రెండో మ్యాచ్‌లోనూ సురేశ్‌ రైనా (72*) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్’ అవార్డు దక్కాయి. ఈ సిరీస్‌లో జింబాబ్వే నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. 

సిరీస్‌ సమం..

దాదాపు ఐదేళ్ల తర్వాత జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు భారత్‌ వెళ్లింది. 2015లో మళ్లీ రెండు టీ20ల సిరీస్‌ జరిగింది. ఈసారి గట్టి పోటీనిచ్చింది. చెరో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయడం గమనార్హం. ఈ సిరీస్‌కు అజింక్య రహానె కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్‌లో భారత్‌ 179 పరుగులను నిర్దేశించగా.. జింబాబ్వే 124 పరుగులకే పరిమితమైంది. అక్షర్ పటేల్ (3/17) అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక రెండో మ్యాచ్‌లో జింబాబ్వే సూపర్ విక్టరీ సాధించి భారత్‌ను మట్టికరిపించింది. 146 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో టీమ్‌ఇండియా విఫలమైంది.అప్పటి జట్టులోని సభ్యుడు సికందర్‌ రజా ఇప్పుడు జింబాబ్వే సారథిగా బరిలోకి దిగుతున్నాడు.

మూడో సిరీస్‌.. భారత్‌దే

భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య మూడో సిరీస్‌ 2016లో జరిగింది. ధోనీ (MS Dhoni) నాయకత్వంలో మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అనూహ్యంగా తొలి మ్యాచ్‌లోనే జింబాబ్వే గెలిచి షాక్‌ ఇచ్చేలా కనిపించింది. రెండో టీ20లో భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే కుదేలైంది. బరిందర్ శ్రాన్ (4/10) దెబ్బకు ఆతిథ్య జట్టు 99/9కే పరిమితమైంది. నిర్ణయాత్మక మూడో టీ20లో జింబాబ్వే నుంచి పోటీ ఎదురైంది. కేదార్ జాదవ్ (58) రాణించడంతో తొలుత భారత్ ఆరు వికెట్లకు 138 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే కూడా 135/6 స్కోరు చేసింది. కొద్ది తేడాతో మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

టీ20 ప్రపంచ కప్‌ 2022లో..

టీ20 ప్రపంచ కప్‌ 2022 (T20 World Cup) ఎడిషన్‌లో జింబాబ్వేపై భారత్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్ 186/5 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (61*: 25 బంతుల్లో) విజృంభించాడు.  అనంతరం జింబాబ్వే 115 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ (3/22) జింబాబ్వే పతనంలో కీలక పాత్ర పోషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని