Suryakumar Yadav: నా దృష్టిలో అతడు ప్రపంచంలోనే బెస్ట్‌ బౌలర్: సూర్య

అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు జడుసుకుంటారు. ఎలా బౌలింగ్‌ వేయాలనేది ఒకటి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, అతడిని కూడా ఇబ్బంది పెట్టే బౌలర్‌ ఉన్నాడు. మరి ఆ బ్యాటర్ సూర్యకుమార్‌ అయితే.. ఆ బౌలర్‌ ఎవరంటే?

Published : 22 Jun 2024 19:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఓవైపు ప్రపంచమంతా టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తేస్తున్నారు. కానీ, టీ20 టాప్ ర్యాంకర్ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం అత్యుత్తమ బౌలర్‌గా మరొకరి పేరును చెప్పడం గమనార్హం. టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 పోరులో భాగంగా అఫ్గానిస్థాన్‌ను ఓడించడంలో సూర్య(Suryakumar Yadav) కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న స్టార్‌ బౌలర్ రషీద్‌ ఖాన్‌పై (Rashid Khan) ఆధిపత్యం ప్రదర్శిస్తే చాలని.. ప్రస్తుతం అతడే ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ అని సూర్య చెప్పాడు. ఇప్పుడా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘‘గతంలోనూ నేను ఇదే మాట చెప్పా. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను అర్థం చేసుకుని ఆడటం చాలా కష్టం. అతడు బౌలింగ్‌కు వచ్చాడంటే ఎలాంటి షాట్లు కొట్టాలనేది ముందే అనుకుంటా. కానీ, ఒక్కోసారి అది విఫలమయ్యే ప్రమాదం ఉంది. అతడిపై ఆధిపత్యం ప్రదర్శించడం సులువేం కాదు. ఈసారి మాత్రం కాస్త దూకుడుగానే ఆడగలిగా’’ అని సూర్య తెలిపాడు. రషీద్ ఖాన్‌ (Afghan spinner Rashid Khan) బౌలింగ్‌లో ఆరు బంతులను ఎదుర్కొన్న సూర్య.. 16 పరుగులు రాబట్టాడు. 

ఓపెనింగ్‌ జోడీ మార్పుపై కోచ్‌ ఏమన్నాడంటే?

టీ20 ప్రపంచ కప్‌ 2024 (ICC Mens T20 World Cup) ఎడిషన్‌లో భారత జట్టు ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ - విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నారు. కానీ, ఒక్కసారి కూడా మంచి భాగస్వామ్యం అందించలేదు. దీంతో ఆ జోడీని మార్చాలనే డిమాండ్లూ వచ్చాయి. ఇవాళ బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా ఆడనుంది. ఈసారైనా మార్పు ఉంటుందా? అనే ప్రశ్నకు భారత బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్ సమాధానం ఇచ్చాడు. ‘‘కోహ్లీ ఓపెనింగ్‌కు రావడం మీకు (విలేకర్లను ఉద్దేశించి) నచ్చలేదా? అయితే, ప్రతి ఒక్కరూ అతడే ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని కోరుకుంటున్నారు. మార్పు చేయాలనే ఆలోచన మాకూ లేదు. ఇప్పుడున్న బ్యాటింగ్‌ ఆర్డర్‌పై సంతృప్తిగానే ఉన్నాం. ఏదైనా మార్పు చేయాల్సి వస్తే.. ప్రత్యర్థి, పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని