Virat Kohli: కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్‌ కోచ్‌

టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ పేలవ ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. అతడికి బ్యాటింగ్‌ కోచ్‌ మద్దతుగా నిలిచాడు.

Published : 17 Jun 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌లో బ్యాట్‌తో చెలరేగి టాప్‌స్కోరర్‌గా నిలిచిన విరాట్‌ కోహ్లీ(Virat Kohli).. పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం తేలిపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయాడు. యూఎస్‌ఏపై డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో విరాట్‌ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ కోహ్లీని వెనకేసుకొచ్చాడు.

కెనడాతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన అనంతరం రాథోడ్‌ మాట్లాడాడు. ‘బాగా ఆడినా.. ఆడకపోయినా.. విరాట్‌ కోహ్లీ గురించి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం నాకిష్టం. అతడి గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడి ఇక్కడికి వచ్చాడు. రెండు సార్లు ఔట్‌ అయినంత మాత్రాన ఏదీ మారదు. బాగా బ్యాటింగ్‌ చేస్తాడు. బాగా ఆడాలనే ఆసక్తి అతడిలో ఉంది. నెట్స్‌లో బాగా శ్రమిస్తున్నాడు. అతడి నుంచి మంచి ఇన్నింగ్స్‌ల కోసం ఎదురుచూస్తున్నాం’’ అని కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.

‘‘మనం ఒక టీమ్‌గా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. మన ముందున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పరిస్థితులకనుగుణంగా మేం ప్రతిస్పందిస్తాం. ఎలాంటి కండిషన్లలోనైనా ఆడేందుకు మా వద్ద సరిపడా వనరులు ఉన్నాయి’’ అని జట్టు  గురించి స్పందించాడు. ఇక కెనడాతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మైదానం మొత్తాన్ని కవర్లతో ఎందుకు కప్పి ఉంచలేదన్న ప్రశ్నను ఐసీసీనే అడగాలని.. వారే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాథోడ్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని