Virat Kohli: కోహ్లీ పరుగులు చేసినా.. నాకు ఆనందంగా లేదు: భారత కోచ్

ఐపీఎల్‌లో దూకుడైన ఆటతీరు ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌లో పెద్దగా రాణించలేదు. అఫ్గాన్‌పై చేసిన 24 పరుగులే అత్యధికం. అదీనూ 24 బంతులు ఎదుర్కొని సాధించాడు. 

Published : 22 Jun 2024 12:31 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2024 ఎడిషన్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలిసారి డబుల్ డిజిట్‌ స్కోరు చేశాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అయితే, టీ20ల్లో ఈ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం సరైంది కాదనే అభిప్రాయం అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లలో నెలకొంది. అదే సమయంలో గత మూడు మ్యాచులతో పోలిస్తే ఈసారి కాస్త ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసినట్లు విరాట్ (Virat Kohli) కనిపించాడని వ్యాఖ్యలు వినిపించాయి. ఇవాళ సూపర్‌-8 పోరులో భాగంగా బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా శుభారంభాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని భారత బ్యాటింగ్‌ కోచ్ (India Batting Coach) విక్రమ్‌ రాథోడ్ కూడా వెల్లడించాడు. 

‘‘అఫ్గాన్‌తో విలువైన పరుగులు చేసిన కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌గా మలచకుండా ఔట్‌ కావడం నాకు ఆనందంగా అనిపించలేదు. అయితే, గతంతో పోలిస్తే మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. టీ20 ప్రపంచ కప్‌లో (ICC Mens T20 World Cup) సవాళ్లు విసిరే పిచ్‌లపై ఇలా ఆడటం కూడా మంచిదే. అదేవిధంగా భారత్‌లో (Team India) ఎక్కువగా పరుగులు చేయని బ్యాటర్లు ఇప్పుడు రాణించడం శుభ పరిణామం. మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రిషభ్‌ పంత్‌ టాప్‌ ఆర్డర్‌లో వస్తూ దూకుడుగా ఆడుతున్నాడు. తప్పకుండా ఇదే ఆటతీరును మిగతా మ్యాచుల్లోనూ కొనసాగిస్తాం. 

పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగానే తుది జట్టు ఎంపిక ఉంటుంది. కొన్నిసార్లు స్పిన్నర్లను ఎక్కువగా తీసుకోవాలి. అత్యుత్తమ టీమ్‌తోనే బరిలోకి దిగామని బలంగా నమ్ముతున్నా. అక్షర్ పటేల్ ఇటు బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించడం సానుకూలాంశం. దాంతో మాకు ఆప్షన్లు అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తోంది. న్యూయార్క్‌లో అత్యంత దారుణమైన పిచ్‌లపై ఆడాం. ఇప్పుడు కరేబియన్‌లో కాస్త మెరుగైన మైదానాల్లో ప్రత్యర్థులతో తలపడుతున్నాం. బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయడం లేదు. అందులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. టీ20 క్రికెట్‌లో ఏ జట్టైనా తీవ్రంగా పోటీనిస్తుంది’’ అని రాథోడ్‌ (Vikram Rathour) వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు