IND vs AUS: ఉప్పల్‌లో అదరగొట్టిన భారత్‌.. ఆసీస్‌పై సిరీస్‌ కైవసం

ఉప్పల్‌లో భారత్‌ అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 25 Sep 2022 23:47 IST

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాను భారత్‌ మట్టికరిపించింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో పట్టేసింది. దీంతో పొట్టి ప్రపంచకప్ సమీస్తున్న వేళ ఈ సిరీస్‌ విజయం టీమ్‌ఇండియాకు ఆత్మవిశ్వాసం కలిగించినట్లైంది. ఇక ఈ సిరీస్‌లో ఉత్తమంగా రాణించిన అక్షర్‌ పటేల్ ప్లేయర్ ఆఫ్‌ సిరీస్‌గా ఎంపిక కాగా.. ప్లేయర్‌ ఆఫ్ మ్యాచ్‌ అవార్డును సూర్యకుమార్‌ యాదవ్‌ అందుకున్నాడు. 

చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన  హైదరాబాద్‌ టీ20లోనూ ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్ (69: 36 బంతుల్లో 5 సిక్స్‌లు, 5 ఫోర్లు), విరాట్ కోహ్లీ (63: 48 బంతుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 104 పరుగులను జోడించి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో హార్దిక్‌ పాండ్య (25*) అదరగొట్టాడు. ఆసీస్‌ బౌలర్లలో డానియల్‌ సామ్స్ 2. జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్‌ కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు.

దంచేసిన డేవిడ్‌, గ్రీన్‌

ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52) ధాటిగా ఆడాడు. పవర్‌ ప్లేలో భారీగా పరుగులు (66) చేసిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే చివర్లో మరోసారి పట్టు విడవడంతో ఆసీస్‌ బ్యాటర్లు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా టిమ్‌ డేవిడ్ (54) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హర్షల్‌, భువనేశ్వర్‌ వేసిన డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టాడు. ఓ దశలో ఆసీస్‌ 150 స్కోరైనా చేస్తుందా..? అని భావించినప్పటికీ చివరికి 186 పరుగులు చేయడంలో టెయిలెండర్‌ బ్యాటర్ డానియల్‌ సామ్స్ (28*) కూడా కారణం. టిమ్‌ డేవిడ్-సామ్స్‌ కలిసి ఏడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో  అక్షర్ పటేల్ 3.. భువనేశ్వర్‌ కుమార్‌, చాహల్, హర్షల్‌ తలో వికెట్ తీశారు. 

మరిన్ని విశేషాలు.. 

* టీ20ల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లలో రోహిత్ శర్మ (33) రెండో స్థానానికి చేరాడు. విరాట్ కోహ్లీ (32)ని అధిగమించాడు. టాప్‌ ప్లేస్‌ మాత్రం మిస్టర్ కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ (42)దే. 

* 2021 తర్వాత భారత్‌ 14 మ్యాచుల్లో ఛేదన చేస్తే.. 13 మ్యాచుల్లో విజయం సాధించింది.

* ఆస్ట్రేలియాపై ఇది నాలుగో రన్‌ ఛేజ్‌: 187/4. ఇంతకుముందు రాజ్‌ కోట్‌ (2013)లో 202 పరుగులు, సిడ్నీ (2016)లో 198 పరుగులు, సిడ్నీ (2020)లో 195 పరుగులను భారత్‌ ఛేదించింది.
Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts